ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. తన పతంజలి ఉత్పత్తుల కావొచ్చు.. యోగా కావొచ్చు.. ఆయనను ప్రపంచ దేశాల్లో ఒక ఐకాన్‌గా నిలబెట్టాయి. అయితే, ఆయన తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో మహిళల వస్త్రధారణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రామ్‌దేవ్‌బాబా శిబిరానికి వచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ ముందే రామ్ దేవ్ బాబా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
థానేలోని పతంజలి యోగా పీఠం, ముంబయి మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగాసైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ భార్య అమృతా ఫడణవిస్ హాజరయ్యారు. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు ఏర్పాటు చేసిన యోగా శిక్షణా కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రత్యేక మీటింగ్ జరిగింది.
అయితే వెంట వెంటనే ఇలా కార్యక్రమాలు జరగడం వల్ల మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు. ఈ పరిస్థితిపై మాట్లాడిన రామ్ దేవ్ బాబా.. ‘మీరు చీరలు ధరించేందుకు టైమ్ లేకపోవడం వల్ల.. ఇప్పుడైనా ఇంటికి వెళ్లి చీరలు ధరించి రావచ్చు. మహిళలు చీరల్లో, సల్వార్ సూట్స్‌లో బాగుంటారని.. తన కంటికైతే మహిళలు ఏం ధరించకోపోయినా.. బాగుంటారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, అసలు బట్టలు విప్పేస్తే మహిళల అందం మరింత మెరుగ్గా ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో రామ్‌దేవ్ బాబాపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై కేసులు పెట్టేందుకు సైతం వారు ప్రయత్నిస్తున్నారు.