ఇది సోషల్ మీడియా జమానా. నిజం నిలకడగా నాలుగు ఊళ్లు దాటేసరికి…అబద్ధం అవలీలగా అరవై ఊళ్లు దాటిపోతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో నిజాలు, అబద్ధాలు, అసత్య ప్రచారాలు అన్నీ ఒకటే వేగంతో దూసుకుపోతుంటాయి. ఈ కోవలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చెందిన ట్రూజెట్ విమానయాన సంస్థ దివాలా తీసిందని, దాంతో ట్రూజెట్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై చెర్రీ తాజాగా స్పందించాడు.
అవన్నీ ఉట్టి పుకార్లేనని, ఉద్యోగులందరికీ జీతాలిల్లిస్తున్నామని చెర్రీ చెప్పాడు. అంతేకాదు, ట్రూజెట్ విమాన సేవలు నిలిపేస్తున్నట్టు వస్తోన్న వార్తలు పూర్తి నిరాధారమైనవని కొట్టిపారేశాడు. ఇక, ఈ పుకార్లపై ట్రూజెట్ ఎండీ ఉమేష్ కూడా ఘాటుగా స్పందించారు. తమ సంస్థపై కొందరు బురద జల్లేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ట్రూజెట్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కొందరు రాజీనామా చేశారని, దాంతో కొత్త ఉద్యోగులు వచ్చారని చెప్పారు.
ట్రూజెట్ విమానయాన సేవలు మళ్లీ ప్రారంభమవుతాయని, ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించబోతున్నామని వివరించారు. ఆ తర్వాత కొత్త సీఈవోను ప్రకటిస్తామని చెప్పారు. ఉడాన్ పథకం కింద చౌక ధరలకే విమాన సర్వీసులను తమ సంస్థ అందించిందని వెల్లడించారు.