ప్రస్తుతం దేశంలో సర్వేల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే నిర్వహించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వే బెస్ట్ సీఎం కేటగిరీలో జగన్ కు 16వ ర్యాంకు రావడంపై విమర్శలు వచ్చాయి. గత ఏడాది మొదటి ర్యాంకులో ఉన్న జగన్ ఈసారి 16వ ర్యాంకుకు పడిపోవడంతో ఆయన పాలన బాగోలేందంటూ ట్రోలింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పనితీరు బాగోలేదని, పార్లమెంటుకు తక్కువ సార్లు వెళుతున్న ఆయనకు ఓ సర్వేలో తక్కువ ర్యాంక్ వచ్చిందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రఘురామ కూడా జగన్ పై ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. నర్సాపురంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే జగన్ పై పోటీ చేస్తే తానే గెలుస్తానని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కంటే తనకు 19 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని సర్వేలో తేలిందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, చెవిరెడ్డి మినహా మరెవరూ మళ్లీ గెలవరని రఘురామ అన్నారు.
175 అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాలకు మించి వైసీపీకి రావని షాకింగ్ కామెంట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరిద్దరు తప్ప వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతికూల పరిస్థితులున్నాయని జోస్యం చెప్పారు. వివేకా హత్యలో ఎవరి ప్రమేయం ఎంత ఉందోనని ప్రజలకు అనుమానం ఉందని, వివేకాకు గుండెపోటు వచ్చిందని విజయసాయికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విజయసాయిని సీబీఐ విచారణ జరపాలని కోరారు.
తాను చేయించిన టెలీఫోన్ సర్వేలో వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై సీట్లు కూడా రావని అన్నారు. అయితే, ఇది ప్రస్తుత పరిస్థితులను బట్టి చేసిన సర్వే అని, భవిష్యత్తులో పరిస్థితులు మారితే వైసీపీకి సీట్లు పెరిగే అవకాశముందని అన్నారు. వాస్తవానికి ఈ సర్వే గణాంకాలను బయట పెట్టదల్చుకోలేదని, కానీ కొందరు వైసీపీ నేతలు చేసిన కొన్ని చిల్లర పనుల వల్ల బయట పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. మరి, రఘురామ సర్వేపై వైసీపీ నేతలు, జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.