ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ కక్ష పూరితంగా తొలగించడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం టీడీపీకి మంచిపేరు వస్తోందన్న అక్కసుతో పేదల నోటికాడి కూడును జగన్ లాగేశారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ దాష్టీకాలకు వెరవకుండా ఎలాగైనా పేదలకు పట్టెడన్నం పెట్టాలని టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్లను ఎలాగోలా నిర్వహిస్తున్నారు. దీంతో, అన్నా క్యాంటీన్లను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే కుప్పంలో పది రోజుల వ్యవధిలో రెండోసారి అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన ఘటన పెను దుమారం రేపింది. అన్యా క్యాంటీన్లను అన్యాయంగా ధ్వంసం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పై రఘురామ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడంపై రఘురామ మండిపడ్డారు. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గమని రఘురామ అన్నారు. మనం ఒకరికి పెట్టం..ఇతరులను పెట్టనివ్వం అన్నట్లుగా జగన్ తీరు ఉందని రఘురామ దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల్లో ముంచేశారని, ఆయనకు రుణరత్న అవార్డు ఇవ్వాలని ఆర్ఆర్ఆర్ సెటైర్లు వేశారు.
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు చేపట్టదలచిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడడంపై కూడా రఘురామ స్పందించారు. ఉద్యోగులపై మన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, వారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని రఘురామ హితవు పలికారు. ఉద్యోగుల జోలికి వెళ్లొద్దని… మన పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయవద్దని రఘురామ సూచించారు. మనకు ‘సాక్షి’ ఉంది కానీ… మనస్సాక్షి లేదని చురకలంటించారు.
Comments 1