సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాల మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సినీ పెద్ద లలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీ సమస్యల మీద ఆయన తరచుగా మాట్లాడుతుంటారు. ఆయన అప్పుడప్పుడూ రాజకీయాల మీద కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా ఏపీ రాజకీయాలు, కూటమి ప్రభుత్వ భవిష్యత్తు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న రాత్రి తనకో కల వచ్చిందంటూ ఆయన చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
తమ్మారెడ్డికి వచ్చిన కలలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఛైర్మన్‌గా మారారట. జనసేనాని పవన్ కళ్యాణేమో సీఎం అయ్యారట. ఇక చంద్రబాబు తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిని అలంకరించారట. ముగ్గురూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారట. ఇంతలో తనకు మెలకువ వచ్చిందని.. అప్పుడు కలలో జరిగిన విషయాలను తలుచుకుంటే భలేగా అనిపించిందని.. ఇలా జరిగితే బాగుంటుంది కదా అని ఆయన అన్నారు.
చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న చాలా మందిలో ఉందని.. చంద్రబాబు సైతం ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారని.. మరోవైపు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని తెలుగుదేశం మద్దతుదారులు కోరుకుంటున్నారని.. అలాగే పవన్‌ను సీఎంగా చూడాలన్నది ఆయన అభిమానుల కోరిక అని తమ్మారెడ్డి అన్నారు.
ఈ నేపథ్యంలో తన కలలో వచ్చినట్లుగా భవిష్యత్తులో బాబు కూటమి ఛైర్మన్ అయి.. పవన్ సీఎం, నారా లోకేష్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపడితే చాలా బాగుంటుందని.. తద్వారా రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని తమ్మారెడ్డి అన్నారు. తమ్మారెడ్డికి నిజంగా కల వచ్చిందా.. లేక ఆయన కోరికను ఇలా కల రూపంలో బయటపెడుతూ.. టీడీపీ వాళ్లకు కౌంటర్ వేశారా అని సోషల్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు.