తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోస్టర్లు వెలిశాయి. అది కూడా.. ఆయన సొంతనియోజకవర్గం గజ్వేల్‌లోనే కావడం గమనార్హం. ఈ పోస్టర్లను స్వయంగా బీజేపీ నాయకులు అంటించడమే కాదు.. వాటి ముందు నిలబడి ఆందోళన కూడా చేశారు. ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు కూడా చేశారు. కేసీఆర్ ఎక్కడున్నా గజ్వేల్‌కు రావాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం కొందరు నాయకులు.. స్థానిక పోలీసు స్టేషన్లో కేసీఆర్ కనిపించడం లేదు.. వెతికి పెట్టండి అంటూ.. ఫిర్యాదు చేశారు. పోస్టర్లలో కేసీఆర్ ఫొటోతో పాటు ఆయన గుర్తులుగా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగీ వేసుకుంటారని.. నెత్తి మీద టోపీ పెట్టుకుంటారని.. ఆయనో భయంకరమైన హిందువు అంటూ రాశారు. పైగా కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని పేర్కొనడం గమనార్హం. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి అని పోస్టర్లలో రాసుకొచ్చారు.
పోస్టర్లో ఏముందంటే..
చిరునామా, పూర్తి పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
వయసు – 70 సంవత్సరాలు
ప్రొఫెషన్ – అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం,
అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం.
బాధ్యత – గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు
గుర్తులు – తెల్లచొక్కా, తెల్ల ప్యాంట్ లేదా తెల్ల లుంగీ, నెత్తి మీద టోపీ
అర్హతలు – భయంకరమైన హిందువు,
80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు రూ.కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి
ముఖ్య సూచన
పైన ఫోటోలో ఉన్న వ్యక్తి గజ్వేల్ నియోజకవర్గానికి మూడోసారి శాసనసభ్యులుగా గెలిచిన క్షణం నుంచి నేటి వరకు గజ్వేల్ నియోజకవర్గానికి రాలేదు. ఎక్కడా కనిపించలేదు. ముఖ్యమంత్రి పదవి పోగానే బాధలో బాత్రూంలో జారి పడి కాలు విరిగిపోయిందని తెలిసింది. సారు కారు పదహారు అని ఎక్కడ పరారు అయ్యారో ఎలా ఉన్నాడో తెలియడం లేదు. కావున దయచేసి ఎక్కడైనా కేసీఆర్ ఆచూకీ తెలిస్తే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించగలరు.
నోట్ –
కేసీఆర్ గారి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును.
ఇట్లు గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు.
ఇంపార్టెంట్: ఈ పోస్టర్లు భారీ ఎత్తున హల్చల్ చేస్తున్నా.. బీఆర్ ఎస్ నాయకులు కనిపించక పోవడం గమనార్హం.