ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల నిర్వహణ సంబంధించి కొన్ని వివాదాలు రేగుతున్నాయి. గతంలో వీటికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టినా వైసిపి ప్రభుత్వం వినిపించుకోని విధంగానే ప్రవర్తించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా వివాదాల బాటలో ఏయూ, ఎన్ యూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కూడా వివాదంలోనే ఉంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల తీరుపై అదే విధంగా అక్కడి నిర్వహణపై ప్రధాన మీడియా కూడా పలు కథనాలు అందిస్తున్నప్పటికీ పట్టించుకోని, వినిపించుకొని వైనంలోనే వైసిపి సర్కారు ఉంటోంది.
ముఖ్యంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో అధ్యాపకుల తీరు విమర్శలకు తావిస్తోంది. అదేవిధంగా ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మందు బాటిళ్లూ, కండోమ్ ప్యాకెట్లూ దొరకడంతో వర్సిటీ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది.
వర్సిటీకి చెందినటువంటి వీసీ తరచు వైసిపి నాయకులతో భేటీ కావడంతో పలు వివాదాలకు ఇవి తావిస్తున్నాయి. ఒక వీసీకి ఒక వైసీపీ ఎంపీతో పని ఏంటి అని విపక్షం నిలదీస్తోంది. అయినప్పటికీ ఎంపీ సాయిరెడ్డి లాంటివారు వర్సిటీ ప్రక్షాళనకు సంబంధించి చర్యలు తీసుకోకపోగా, వీసీ తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారన్నటువంటి విమర్శ కూడా ఉంది.
ఇదే సందర్భంలో నాగార్జున యూనివర్సిటీ కూడా వివాదాల్లోనే ఉంది. ప్లీనరీకి సంబంధించి రేగిన వివాదాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇక్కడ ప్రాంగణంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించడంతో ఆ ..రెండు రోజులు పాటు తరగతులు నిలిపివేశారు. స్పాట్ వాల్యువేషన్ కూడా రద్దు చేశారు.అదేవిధంగా వర్శిటీ గదులను ప్లీనరీ నిర్వహణకే కేటాయించి నవ్వుల పాలయ్యారు.
వీటికి తోడూ విమర్శలూ, అభియోగాలూ షరా మామూలే ! ఆ తర్వాత కూడా పలు వివాదాలు రేగాయి.ఇక్కడ ఇంఛార్జి వీసీతోనే కాలం నెట్టుకువస్తున్నారు. వర్సిటీల నిర్వహణకు సంబంధించి గతంలో మాదిరిగా పారదర్శకమైన నిర్ణయాలు ఏవీ ప్రభుత్వం తీసుకోవడం లేదని పలుమార్లు ప్రధాన మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించిన దాఖలాలే లేవు అన్నది అంగీకరించక తప్పని నిజం.
గతంలో పోలిస్తే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో నడుస్తున్నటువంటి బీఆర్ఏయూలో కూడా విద్యా ప్రమాణాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా డిగ్రీ , పీజీ కోర్సుల నిర్వహణ సంబంధించి తరచూ వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వీటి ప్రక్షాళనకి సంబంధించి వైసీపీ సర్కారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవీ కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో లేవు.
ముఖ్యంగా కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో అధ్యాపకుల బృందం పూర్తి స్థాయిలో లేకపోవడంతో విద్యార్థులు ఎంతగానో నష్టపోతున్నారు. నాణ్యమైన విద్య అందించే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ అటువంటి చర్యలేవీ లేకపోగా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటూ విమర్శల పాలవుతున్నారే తప్ప! వర్సిటీలను బాగుచేసే క్రమంలో భాగంగా వీరెవ్వరూ కూడా లేరు అన్నది విద్యార్థి లోకం ఆరోపణ. ఇప్పటికైనా వర్శిటీలను ప్రక్షాళన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నది విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం. విన్నపం కూడా !