రాజధాని అమరావతిపై అదే విషం
గుళ్లపై దాడులకు విపక్షాలతో లింకులు
జగన్ మార్కు రాజకీయం
‘రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాలు మారిపోతాయని కేసు వేస్తే.. స్టేలు రావడం బాధగా అనిపించింది’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తెగ బాధపడిపోయారు. రాజధాని అమరావతిపై మరోసారి ‘కులం’ విషం చిమ్మారు. అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతు త్యాగానికి ఆయన దృష్టిలో పూచికపుల్ల విలువ లేదు. వారికి ఏటా చెల్లించాల్సిన పెన్షన్ చెల్లించరు. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వరు.. అక్కడ రోడ్ల నుంచి ఇతర మౌలిక వసతులన్నీ ఆపేశారు. రాజధాని పేదలకు చంద్రబాబు నిర్మించిన ఐదు వేల ఫ్లాట్లను వారికి పంచకపోగా.. అక్కడ కృష్ణా జిల్లాకు చెందిన స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ స్థానికేతరులంతా వైసీపీ మద్దతుదారులే. రాజధాని గ్రామాల్లో తమపై నెలకొన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి.. అక్కడ ఓట్లు తగ్గకుండా చూసుకోవడానికి ఇతర ప్రాంతాలవారిని అక్కడకు తీసుకురావాలన్నది అసలు పన్నాగం. దీనిపై అమరావతి జేఏసీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. ‘డెమోగ్రఫీ’ మారిపోతుందని వాదించారు. కోర్టు స్టే ఇచ్చింది. ఈ డెమోగ్రఫీకి కులాలు మారిపోతాయన్న అర్థం జగన్ కనిపెట్టారు. చట్టాలకు, కోర్టు నిర్ణయాలకు కూడా వక్రభాష్యాలు చెబుతున్నారు. ప్రజలకు ఆంగ్లం రాదన్న భ్రమల్లో ఉన్నారు.
తనకొక్కడికే ఇంగ్లిష్ తెలుసన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ‘అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలిసి ఉంటేనే అది రాజధాని అవుతుంది. పేదలు సహా ఏ కులం ఉండకూడదంటే.. దానిని రాజధాని అంటారా’ అని తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన అన్నారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు పట్టాలివ్వాలని తమ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టి ముందడుగు వేసిందని.. కానీ కులపరమైన అసమతుల్యత (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్) అంటూ గత ప్రభుత్వానికి చెందిన వాళ్లు కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం స్టే విధించిందని పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్‌ను చూసి కోర్టు స్టే ఇవ్వడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. ఆయన మాటలు అసత్యాలని చెప్పక తప్పదు.
కోర్టు తీర్పును కూడా వక్రీకరించి అబద్ధాలు వల్లిస్తున్నారు. రాజధానిలో పేదలు కూడా ఉండాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఐదు వేల ఎకరాలు కేటాయించింది. 8 వేల మందికి ఇళ్లు కేటాయించి అందులో 5,024 మందికి ఇళ్లు కూడా కట్టించి సిద్ధం చేసింది. వాటికి విద్యుత, మంచినీటి సౌకర్యం కల్పించకుండా పేదలు ఆ ఇళ్లలో ఉండే అవకాశాన్ని దూరం చేసిన జగన.. ఇప్పుడిలా మాట్లాడుతున్నారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం కట్టించిన ఈ ఇళ్ళను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుబెట్టడంపైనే మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తదితరులు కోర్టును ఆశ్రయించారు.
అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని అటు రైతులు గానీ, ఇటు కోర్టు గానీ ఎవరూ తప్పుబట్టలేదు. సీఆర్డీఏ పరిధిలో ఆ ప్రాంతంలో లే-అవుట్ అప్రూవల్ ఉండాలంటే కనీసం రెండు సెంట్లు పైన ఉండాలి. అయితే వైసీపీ ప్రభుత్వం కేవలం సెంటు మాత్రమే కేటాయిస్తున్నందున ప్లాన అప్రూవల్‌కు అవకాశం లేదు. అంతే గాకుండా ఇచ్చిన స్థలాలను ఏడాది తరువాత అమ్ముకోవచ్చని ప్రభుత్వ జీవోలో ఉన్నందునే కోర్టు తప్పు పట్టింది. దీనిపై కోర్టుకు వెళ్లిన రాజధాని రైతులు కూడా స్థానికులకు కాకుండా బయటి వారికి ఇవ్వడాన్ని తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించారు. అసలు నిజమిది. అమరావతిలో అన్ని కులాలు, మతాలు, విభిన్న సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నా కళ్లు ఉండీ సీఎం జగన చూడలేకపోతున్నారని ఏపీ రాజధాని పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు కూడా. అమరావతిని రాజధానిగా కొనసాగించడం ఇష్టం లేని జగన కళ్లు తెరిచి చూస్తే రాజధాని పరిధిలో శాసనసభ నియోజకవర్గాలు దళితులకు కేటాయించిన విషయం కనపడుతుందన్నారు. నిజానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కనకదుర్గ అమ్మవారికి కూతవేటు దూరంలో తాడేపల్లిలో ప్రస్తుతం సీఎం నివసిస్తున్న ప్రాంతంలో సీఎం ఇంటికి ఎదురుగా పెద్ద చర్చి ఉంది.
సీఎం ఇంటి ఎదుట రోడ్డుపై క్రిస్టియనపేట అని పెద్ద బోర్డు ఉంది. రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి చేనేత కార్మికుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా పరిచయం. విజయవాడ నగరంలో ఒక కొండపై కనకదుర్గ… మరో కొండపై మేరీ మాత ఆలయం ఉన్నాయి. ఆది నుంచీ ఇక్కడి ప్రజలు కులమతాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. జగన్ ఆ సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్నారని, పదే పదే కులాల ప్రస్తావన తెస్తూ.. అక్కడ ఒక కులం మాత్రమే ఉందని విషం చిమ్ముతూ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వివిధ వర్గాలు మండిపడుతున్నాయి.
రథాలు తగులబెట్టి… రథయాత్రలు చేస్తున్నారట!
ఇక జగన్ ఏలుబడిలో ఇప్పటివరకు 140కిపైగా ఆలయాల్లో దాడులు జరిగాయి. ఇటీవల వరుసగా దేవతా విగ్రహాల విధ్వంసాలు జరుగుతున్నాయి. దోషులను పట్టుకోకుండా ఎక్కడికక్కడ పోలీసుల చేతులు కట్టివేస్తున్న సీఎం.. ఇప్పుడు సుభాషితాలు వల్లెవేస్తున్నారు. రథాలను ఎవరు తగులబెడుతున్నారో.. ఆ తర్వాత రథయాత్రలకు ఎవరు బయల్దేరుతున్నారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు సభలో అన్నారు. తన ప్రభుత్వంపై పొలిటికల్ గెరిల్లా యుద్ధం చేస్తున్నారని మరోసారి ఆరోపించారు.
ఇళ్ల పట్టాల పంపిణీ, రైతు భరోసా, నాడు-నేడు.. ఇలా పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడల్లా.. తన ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండేందుకు గుళ్లపై దాడులు జరుగుతున్నాయని.. చెడ్డపేరు తేవడానికి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మరి పోలీసు శాఖ ఏం చేస్తోంది? అర్ధరాత్రి విశాఖలో ఏం జరుగుతోందో.. ప్రభుత్వం ఏం చేస్తోందో ఆయన మరిచారా? టీడీపీ నేతల ఇళ్లు, భూములే టార్గెట్‌గా శని, ఆదివారాల్లో అర్ధరాత్రి పూట విశాఖ రెవెన్యూ, పురపాలక అధికారులు టీడీపీ నేతలు ఆస్తులపై పడి.. పొక్లయిన్లతో కూల్చేస్తున్నారు. భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. కోర్టు విచారణలు, స్టేలతో సంబంధం లేకుండా ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. ఇదేనా జగన్ మార్కు రాజకీయం?
ఒక్క లేఖతో సీజేలే క్షణంలో బదిలీ
మీపై గెరిల్లా వార్ చేసే సాహసమా: పవన్
తనపై పొలిటికల్ గెరిల్లా యుద్ధం చేస్తున్నారన్న సీఎం జగన్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ చక్కటి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు?’ అని వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎస్‌లు… మరో 115 మంది అదనపు ఎస్పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకుని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
‘నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్‌పైనా, సోషల్‌మీడియాలో మీపై, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు…దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? ఊరికో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా’’ అని నిలదీశారు.