రోడ్డు ప్రమాదాలకు వ్యాక్సిన్ లేదు...ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అతి వేగం అనర్థదాయకం అని....అప్రమత్తతే శ్రీరామరక్ష అని చెబుతున్నా వినని కొందరి నిర్లక్ష్యం వల్ల ఎందరో జీవితాలు చిన్నాభిన్నమవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబ పెద్ద ఒక్కడు చనిపోయినా...లేక తీవ్రంగా గాయపడినా....ఆ కుటుంబమంతా రోడ్డునపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.


ఇక, ఎవరో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తమవారు కానరాని లోకాలకు వెళ్లిన వారి బాధ వర్ణనాతీతం. అందుకే, ప్రయాణ సమయాల్లో భద్రతే ముఖ్యమని చాటి చెప్పేందుకు పోలీసులు, రవాణా శాఖాధికారులు రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా రహదారి భద్రతా మాసాన్ని నిర్వహిస్తుంటారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధలనపై అవగాహన కల్పిస్తుంటారు.


ఈ క్రమంలోనే తాజాగా జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక కార్యక్ర‌మంలో  టాలీవుడ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు.  సైబ‌రాబాద్ పోలీసుల‌ పెట్రోలింగ్ వాహ‌నాల‌కు తారక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓ సినీన‌టుడిగా ఈ కార్యక్రమానికి రాలేదన్న ఎన్టీఆర్.... రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఓ పౌరుడిగా ఇక్క‌డకు వ‌చ్చానని అన్నారు.


ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలను పాటించ‌డమే అన్నిటికన్నా ముఖ్య‌మని ఎన్టీఆర్ చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్‌ ఉందని...కానీ, రోడ్డు ప్రమాదాలకు లేదని అన్నారు. రోడ్డు ప్రమాదంలో తన అన్న, తండ్రిని కోల్పోయానని, 33 వేల కిలోమీటర్లు తన తాత గారి పర్యటనలో ఎంతో జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసిన నాన్న అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై అవ‌గాహ‌న కోసం పోలీసులు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని, అందరూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను పాటించి మ‌ళ్లీ సుర‌క్షితంగా ఇంటికి వెళ్లాల‌ని పిలుపునిచ్చాడు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.