భారత దేశంలోని కోట్లాది మంది హిందువుల శతాబ్దాల నాటి కల నెరవేరుస్తూ అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో తొలి ఘట్టం ఈ రోజు విజయవంతంగా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరుస్తూ జనవరి 22న చరిత్రాత్మక ఘట్టం పూర్తయింది. అయోధ్య రామ మందిరంలో ‘బాల రాముడి(రామ్ లల్లా)’ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ దిగ్విజయంగా పూర్తయింది. 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య పూర్తి చేశారు.
ప్రసన్న వదనం, చిరు దరహాసం, స్వర్ణాభరణాలతో, ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాల రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఇది తొలి దశ మాత్రమే. రెండో దశలో ఆలయంలో సీతా దేవి, లక్ష్మణులు, హనుమంతుడు విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. భారత ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్నరీతిలో జరిగింది.
గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి మోడీ తొలి పూజ చేసి స్వామివారికి తొలి హారతినిచ్చి ఆయన పాదాల వద్ద పూలను పెట్టారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత రామజన్మభూమిపై ఆర్మీ హెలికాప్టర్లతో పూలను చల్లారు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా , థియేటర్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, యూట్యూబ్ లో, ఇంటర్నెట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, చంద్రబాబు, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ తదితర వీవీఐపీలు 7 వేలకు పైగా హాజరయ్యారు. చలి తీవ్రత, అనారోగ్య కారణాలతో అద్వానీ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.