2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో, దేశంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటిషియన్, విజనరీ లీడర్ చంద్రబాబు నాలుగో సారి ఏపీకి సీఎం కాగా…ప్రపంచంలోని అతి శక్తిమంతమైన లీడర్లలో ఒకరైన మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఈ ఇద్దరి డెడ్లీ కాంబినేషన్ లో ఇటు రాష్ట్రం, అటు దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేందుకు ప్రధాని మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ నెల 8న మోదీ విశాఖలో పర్యటించనున్నారు.
ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్ కె.విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. 8న ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుంటారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్ పరిపాలనా భవనాల నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. గత ఏడాది నవంబర్ 29న విశాఖలో మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆ పర్యటన రద్దయింది.