విడి రోజుల్లో ఎవరెంత అరిచి గీపెట్టినా పట్టించుకోని మోడీ సర్కారు.. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఇట్టే అప్రమత్తం అవుతుంది. పెరిగిపోయే పెట్రోల్.. డీజిల్ ధరలకు నామమాత్రంగా తగ్గింపు చర్యలు చేపట్టి కంటితుడుపు నిర్ణయాల్ని ప్రకటిస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నా.. తగ్గుతున్నా అందుకు తగ్గట్లు ధరల్ని తగ్గించే విషయంలో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటం తెలిసిందే.
అలాంటిది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కారు పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే.. తగ్గించిన ధరలు లీటరుకు రూ.2 కావటమే గమనార్హం. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన పెట్రోల్.. డీజిల్ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
ధరల తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 నుంచి రూ.94.72కు తగ్గనుంది. అదే సమయంలో డీజిల్ ధర లీటరు రూ.89.62 నుంచి రూ.87.62కు తగ్గనుంది. వారం క్రితం వంట గ్యాస్ బండ ధరను రూ.వంద చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కేంద్రం తగ్గించిన లీటరుకు రూ.2 చొప్పున లెక్క వేస్తే.. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ మీద రూ.2.70, డీజిల్ మీద రూ.2.54 చొప్పున తగ్గనుంది.
హైదరాబాద్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.66గా ఉండగా.. తాజా తగ్గింపుతో రూ.106.96కు తగ్గనుంది. డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ.95.28కు తగ్గనుంది. ఏమైనా ఎన్నికల వేళలో తప్పించి.. విడి రోజుల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గించాలన్న ఆలోచన కూడా మోడీ సర్కారుకు రాదన్న విషయం తాజా నిర్ణయంతో మరోసారి నిరూపితమైందని చెప్పాలి.