2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లిక్కర్ స్కామ్ లో అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్….అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా మాజీ సీఎం కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి జరిగిన వైనం సంచలనం రేపింది. ఈ పరిణామంతో ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గ్రేటర్ కైలాష్‌లో ప్రాంతంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ యువకుడు హఠాత్తుగా లిక్విడ్ తో దాడి చేశాడు. తన చేతిలో ఉన్న బాటిల్‌తో ద్రావణాన్ని కేజ్రీవాల్ మొహంపై పోవడంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. వెంటనే ఆ యువకుడిని పట్టుకొని ఆప్ కార్యకర్తలు చితకబాదారు. ఆ బాటిల్ లో స్పిరిట్ ఉన్నట్లు గుర్తించామని ఆప్ నేతలు చెబుతున్నారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేజ్రీవాల్ పై దాడి నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 35 రోజుల వ్యవధిలో కేజ్రీవాల్‌పై మూడోసారి దాడి జరిగిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌పై గతంలోనూ ఓ వ్యక్తి ఇంక్ దాడి చేశాడు. సీఎం క్యాంప్ కార్యాలయంలోనే కేజ్రీవాల్‌పై ఇంకు చిమ్మడం అప్పట్లో సంచలనం రేపింది.