2019 ఎన్నికలకు ముందు టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వైసీపీకి సానుభూతి చూపించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుతోపాటు మంచు విష్ణు కూడా మాజీ సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగారు. అయితే, మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇవ్వలేదనో…మరే కారణం చేతనోగానీ 2024 ఎన్నిలకు ముందు వైసీపీకి మంచు కుటుంబం దూరం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తో ‘మా’ అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన సోదరుడు, డైనమిక్ మినిస్టర్ లోకేశ్ ను కలిసి పలు విషయాలు చర్చించానని విష్ణు ఎక్స్ లో పోస్ట్ చేశారు. లోకేశ్ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి అని, ఆయనకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని విష్ణు కోరారు. అయితే, రాష్ట్రంలో ఇండస్ట్రీ విస్తరణ, స్టూడియోల నిర్మాణం, షూటింగులు, ఫిల్మ్ టూరిజం వంటి విషయాలపై లోకేశ్‌తో విష్ణు మాట్లాడారని తెలుస్తోంది. రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించారని టాక్. ఇండస్ట్రీలోని పెద్దలు లేకుండా లోకేశ్ ను విష్ణు సింగిల్ గా కలిశారు కాబట్టి ఇది వ్యక్తిగత భేటీ అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీకి మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గర కావాలని చూస్తున్నారనేందుకు ఇది మంచి సంకేతం అని ప్రచారం జరుగుతోంది.