మచిలీపట్నంలో ప్రభుత్వ భూమిని వైసీపీ ఆఫీసుకు అప్పణంగా కట్టబెట్టేందుకు ప్రయత్నించడంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ కబ్జాకు గురైన భూమిని విలేకరులకు చూపించేందుకు వెళుతున్న రవీంద్రను, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన వైనం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర…ఆ స్థలం కబ్జాపై మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.
వైసీపీ ఆఫీసు కోసం దాదాపు 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని రవీంద్ర ఆరోపించారు.రూ.300 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీస్‌కి ఇస్తారని నాని ప్రశ్నించారు. అది పేర్ని నాని కష్టమా, ఆయన తండ్రి కష్టమా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భూ రికార్డులు మార్చిన అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
రిటైర్ అయినా సరే ఆ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం తాము పోరాడుతామని అన్నారు. ఆ భూమి ఏపీ పోలీసుల క్వార్టర్స్‌దని మాస్టర్ ప్లాన్‌లో క్లియర్ గా ఉందని, ఆ భూమి పోతున్నా కాపాడుకోలేరా? అని పోలీసులను నిలదీశారు. వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేస్తుంటే అధికారులు లంచాలకు కక్కుర్తిపడి సహకరిస్తున్నారా? అని షాకింగ్ ఆరోపణలు చేశారు.
పోలీసుల ఆస్తి కోసం తాము పోరాడుతుంటే పోలీసులు తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని అన్నారు.