సమర్థత-స్వచ్ఛత.. ఈ రెండు అంశాలు.. ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. సమర్థులైన నాయకులే కాదు.. వారిపై ఎలాంటి మచ్చలు లేకుండా ఉండే వారిని ప్రజలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వస్తున్న రిజల్ట్‌ను నిశితంగా పరిశీలిస్తే.. ఈ రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ సమర్ధుడే. కానీ, స్వచ్ఛత కోల్పోయారు. లిక్కర్ కుంభకోణం సహా.. మొహుల్లా క్లినిక్‌ల నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వున్నాయి.
ఫలితంగా.. దశాబ్దం కిందట.. కేజ్రీవాల్‌పై ఉన్న స్వచ్ఛత అనే ట్యాగ్ చెరిగిపోయింది. ఇక, సమర్థత విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికీ ఆ మార్కు ఉంది. కానీ, సమర్థత కన్నా.. స్వచ్ఛత ఉంటేనే పాలన బాగుంటుందని.. అవినీతి లేని పాలన చేరువ అవుతుందని ప్రజలు విశ్వసించిన తీరు స్పష్టంగా కనిపించింది. ఈ విషయంలో గత ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ ఇదే కనిపించింది. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్న పిలుపునకు గ్రామాలు కదిలివ చ్చాయి.
కారణం.. సమర్థత, స్వచ్ఛత రెండూ ఉన్నాయనేది ప్రజలు చెప్పిన మాట. ఇచ్చిన తీర్పు. ఐదేళ్ల వైసీపీ హయాంలో చిన్నపాటి రోడ్డు కూడా నిర్మించలేక పోవడం.. ముఖ్యమంత్రిగా జగన్ అసమర్థతను చాటిం దని.. చాలా మంది ఎన్నికలకు ముందే పేర్కొన్నారు. బూతుల మంత్రులను నిలువరించక పోవడం.. ఎంపీ అశ్లీలతను, డెడ్ బాడీ డోర్ డెలివరీని కూడా.. సమర్థించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. ఇక, వివేకా దారుణ హత్యాకాండ ద్వారా.. సమర్థత-స్వచ్ఛత రెండూ సముద్రంలో కొట్టుకుపోయాయి.
ఫలితంగా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కట్ చేస్తే.. మోడీ విషయంలో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఇదే చూశారన్నది విశ్లేషకుల అభిప్రాయం. మోడీ సమర్ధతతో ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని.. ఆయన స్వచ్ఛతతో అవినీతికి ఫుల్ స్టాప్ పడుతుందన్న అభిప్రాయం ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని చెబుతున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రోజుకో కుంభకోణం.. రోజుకోఅవినీతి అన్నట్టుగా తెరమీదికి వచ్చాయి. దీనినే ప్రజలు ఏవగించుకుని.. మోడీ సమర్థతకు, స్వచ్ఛతకు పట్టం కట్టి ఉంటారని చెబుతున్నారు.