వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తన సొంత నివాసం.. తాడేపల్లి ప్యాలస్ వద్ద గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంపై పెద్దగా స్పందించలేదు. అసలు ఏమీ తెలియనట్టే వ్యవహరించారు. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం తాలూకు ఫొటోలు, వీడియోలు కూడా.. బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారనే విమర్శలు కూడా వచ్చాయి. చివరకు.. ఘటన జరిగిన రెండు మూడు గంటల తర్వాత కానీ.. విషయం బయటకు రాలేదు.
ఆ తర్వాత.. సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినప్పటికీ.. జగన్ ఈ అగ్ని ప్రమాదంపై పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు.అసలు ఈ విషయం తెలియనట్టే వ్యవహరించారు. కానీ.. తాడేపల్లి అగ్ని ప్రమాదాన్ని సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. “అక్కడ ఏం జరిగిందో నాకు నివేదిక ఇవ్వండి“ అని సంబంధిత అధికారులను, పోలీసులను కూడా ఆదేశించారు. దీంతో గత రాత్రి హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలు, ధరల పెంపు, డిస్టిలరీల కేటాయింపులు.. వంటి విషయా లపై కూటమి సర్కారు దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్లకు అనుమతించ కుండా.. కేవలం నగదు తీసుకోవడం, ఇది ఎటు పోయిందో కూడా లెక్కలు చెప్పకపోవడం.. పైగా 25 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి అప్పులు చేయడం వంటివాటిని కూటమి సర్కారు సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ బృందం ఇంకా బాధ్యతలు చేపట్టకముందే.. ప్రకటన విడుదలైన కొన్ని గంటల్లోనే తాడేపల్లి ప్యాలస్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. దీనిలోపలు కీలక ఫైళ్లు, పత్రాలు కూడా దహనమయ్యాయన్న సమాచా రం.. ప్రభుత్వానికి చేరింది. దీంతో అసలు అక్కడ ఏంజరిగిందన్న విషయంపై చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారు జాము నుంచి ఆదారాలు సేకరించే పనిలో పడ్డారు. చివరకు ఏం తేలుస్తారో చూడాలి.