సాధారణంగా రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఒక్క తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మినహా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ.. కూటమి ప్రభుత్వాలే నడుస్తున్నాయి. అయితే.. కూటమి అంటేనే కలగూర గంప అనే భావన ఉంది. అనేక సిద్ధాంతాలు… భావాలు.. ఉన్న నాలుగైదు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. ఇవి ఎంత కాలం మనగలుగుతాయన్నది ప్రశ్నార్థకమే. మళ్లీ వచ్చే ఎన్నికల వరకు కూటమి ఉంటుందా? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
అలాంటి సందిగ్థమైన సమయంలో ఏపీలో ఏర్పడిన బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి బలమైన వ్యూహంతో ముందుకు సాగుతుండడం గమనార్హం. ఎవరినీ ఎక్కువ చేయకుండా.. ఎవరినీ తక్కువ చేయకుండా.. సాగుతున్న తీరు..నభూతో అనే చెప్పాలి. ఈ విషయంలో టీడీపీ, జనసేనలు చక్కటి సమన్వయాన్ని ప్రదర్శిస్తుండడం మరో కీలక విషయం. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నేటికి(ఏప్రిల్ 12) పది మాసాలు అయింది. ఈ సమయంలో అనేక సమస్యలు వచ్చాయి.
క్షేత్రస్థాయిలో అనేక గిల్లికజ్జాలు, నాయకుల అలకలు.. బుజ్జగింపులు, పదవుల పందేరాలు.. ఇలా అనేక విషయాలు తెరమీదికి వచ్చినప్పటికీ.. ఎక్కడా కట్టు తప్పకుండా ముందుకు సాగుతున్నాయి. ఈ విష యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ముందుగానే గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకుంటు న్నాయి. మేం కలిసే ఉంటాం! అన్న సంకేతాలను బలంగా పంపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకులు కూడా కట్టు తప్పకుండా.. ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ తరహా రాజకీయాలు గత పది మాసాల్లో అనేకం జరిగాయి. మరో నాలుగు సంవత్సరాలు కూటమి పార్టీల మధ్య సఖ్యత ఇలానే ఉంటే.. మరోసారి అధికారం తమదేనన్న ధీమా చంద్రబాబు, పవన్‌లలో కనిపిస్తుండడం గమనార్హం. మరోవైపు.. పాలన పరంగా కూడా.. పూర్తి విభజన తీరుతో వ్యవహరిస్తున్నారు. ఒకరి శాఖలోకి మరొకరు జోక్యం చేసుకోకుండా.. ఒకవేళ చేసుకున్నా.. వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా వేస్తున్న అడుగులు పాటిస్తున్న సంయమనం.. వంటివి కూటమికి శ్రీరామరక్షగా మారింది. అందుకే.. ఈ పదిమాసాల కాలంలో ఎలాంటి చీకు చింతా లేకుండా.. కూటమి సాగిపోయిందన్న భావన కలుగుతోంది.