పల్నాడు జిల్లా యల్లమందలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. గ్రామంలో ఇంటింటికీ తిరిగి స్వయంగా లబ్ధిదారులకు నగదును ఆయన అందజేశారు.
తనకు హైకమాండ్ లేదని, 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడనంత విధ్వంసం గత ఐదేళ్లలో జగన్ పాలనలో చూశానని వెల్లడించారు.
వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి నిర్వీర్యం చేశారని, కేంద్రం నిధులను దారి మళ్లించేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పొరుగు రాష్ట్రాలకు రిపోయాయని, తమను చూసి ఒక్కో కంపెనీ రాష్ట్రంలోకి అడుగుపెడుతోందని అన్నారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని, అందుకు ప్రజలిచ్చిన తీర్పే కారణమని చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే తాటతీస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంచివాళ్లకు మంచిగా ఉంటా… దారి తప్పితే ఊరుకోబోనని అన్నారు. తాము అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను ఎత్తివేశామని తెలిపారు. గుంతలు లేని రహదారులు ఉన్న రాష్ట్రంగా మార్చే బాధ్యత తమదని చెప్పారు.