ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీ నెలకొన్న అసంతృప్తి అలానే కొనసాగుతోం ది. నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఈ వివాదం ఎప్పుడైనా రగులుకునేందుకు రెడీ అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరేందుకు రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబును కలిశారని, తర్వాత నారా లోకేష్‌లో భేట అయ్యారంటూ.. కూడా వార్తలు హల్చల్ చేశాయి.
ఇక, కొలుసు రేపో మాపో పార్టీలో చేరనున్నారంటూ.. 18, 20, 21 తేదీలలో ఆయన కండువా మార్పు ఖాయ మని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు ఈ ఊసుకు సంబంధించి ఇటు కొలుసు కానీ, అటు టీడీపీ కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇంకోవైపు.. టీడీపీ నుంచి మౌనమే సమాధానంగా ఉంది. తాజాగా చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే, మరోవైపు.. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బోడే ప్రసాద్.. ఏం జరిగినా బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు పంపించారు.
దీంతో పెనమలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఏం జరగబోతోందనే విషయం ఆసక్తిగా మారింది. పార్టీని నమ్ముకుని, నియోజకవర్గాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్న బోడే.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం.. నాయకులను, క్షేత్రస్థాయిలో కేడర్‌ను కూడా.. కూడగడుతున్నారు. తనకు వ్యతిరేకులుగా ఉన్నవారిని కూడా ఇటీవల సంక్రాంతి సమయంలో కూడగట్టి.. మంతనాలు సాగించారు. తనకు అనుకూలంగా పనిచేయాలన్నా.. దీనికి వారం నుంచి అభయం కూడా దక్కింది.
తనను కాదని వేరేవారికి టికెట్ ఎలా ఇస్తారంటూ.. బోడే ప్రసాద్ అనుచరులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నా రు. దీంతో పెనమలూరు నియోజకవర్గంలో బోడే తప్ప.. ఎవరికి టికెట్ ఇచ్చినా.. పార్టీ ఓటమి ఖాయమనే సంకేతాలు దాదాపు ఇచ్చారు. పైగా ఎన్నికలకు ముందు టీడీపీ ఇలాంటి పరిస్థితిని అంచనా వేయడం లేదు. అందరినీ కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అయితే.. కొలుసును మాత్రం పార్టీలోకి తీసుకోవ డం ద్వారా బీసీలకు తాము అనుకూలమే వాదనను మరింత బలంగా వినిపించేందుకు రెడీ అయింది.
ఈ నేపథ్యంలో దీనిని తేల్చడం కష్టంగా మారింది. అయితే.. ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఈ సీటును జనసేనకు కేటాయించి తాను తప్పుకొంటే ఇబ్బంది ఉండదనే దిశగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అప్పుడు తనకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. కాగల కార్యం.. అన్నట్టుగా పరిస్థితి తన చేతి నుంచి తప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారోచూడాలి.