నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరు నేతల తీరు పార్టీకి సైతం చెడ్డపేరు తీసుకొస్తుందని చెప్పాలి. పేర్ని నాని కి రాజకీయంగా.. వ్యక్తిగతంగా మంచి పేరుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారన్న మాట చెబుతుంటారు.
ఎంత అధికారపక్షమైనా కావొచ్చు. మరెంత తిరుగులేని అధిక్యత ఉండొచ్చు. ఎదుటోళ్ల పట్ల గౌరవమర్యాదలు చాలా అవసరం. అందుకు భిన్నంగా వ్యవహరించే ధోరణి రాజకీయాల్లో అంతగా రాణించదు. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు కావటం రాజకీయాల్లో మామూలే.
2019లో గెలిచి.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తన మాట తీరుతో అందరిని విస్మయానికి గురి చేశారు. చూసేందుకుపెద్ద మనిషిగా ఉండి.. అవసరం లేకున్నా మాటలు అనేసి.. అంతకు రెట్టింపు మాటలు అనిపించుకునే ధోరణిని చూసినోళ్లకు పేర్ని నానికి ఏమైంది? అనుకున్నోళ్లు లేకపోలేదు. అవసరానికి మించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మాటలు అనేయటం ద్వారా.. ఆయన తీరుపై అందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి.
అవసరం ఉన్నా లేకున్నా కెలికే అలవాటు ఒకసారి మొదలయ్యాక అది అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. పేర్ని నానిలో అదెంతలా పెరిగిందనటానికి నిదర్శనంగా ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాన్ని చూస్తే అర్థమవుతుంది.
అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు.. మాజీ మంత్రి పేర్ని నాని ఎదురయ్యారు. అప్యాయంగా పలుకరించుకున్నారు. వారి మధ్య మాటలు జరిగిన తీరును చూసినోళ్లంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ.. టీడీపీ నేతల మధ్య ఈ మాత్రం మాటలు ఉంటాయా? అని. కానీ.. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆరా తీసినోళ్లకు పేర్ని నాని కెలికే ధోరణి అవగతమైంది.
పయ్యావుల కేశవ్ ఎదురైన వేళ.. కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాక.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పయ్యావుల కేశవ్ గెలవాలని తాను కోరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. పేర్నినాని మాటకు అర్థం.. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి రాదన్న ఒక సెంటిమెంట్ ఉంది. అందుకు తగ్గట్లే.. ఆయన ఆ వ్యాఖ్య చేశారు. దీనికి పయ్యావుల మాత్రం ఊరుకుంటారా? అందుకే పేర్ని నాని చురకకు తనదైన రీతిలో బదులిస్తూ.. నో డౌట్, 1994లో ఫలితాలు 2024లో రిపీట్ అవుతాయన్నారు. 1994లో ఉరవకొండలో టీడీపీ గెలవటమే కాదు.. పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా. ఆ విషయాన్ని గుర్తు చేసేలా పయ్యావుల పంచ్ ఉందంటున్నారు. ఇదంతా చూసినోళ్లు.. పేర్ని నానికి పనేమీ లేకపోతే ఇలానే ఉంటుంది. కెలికి మరీ మాట అనిపించుకుంటాడన్న మాటను రావటం గమనార్హం.