ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలకు భద్రతను కుదించడం జగన్ కు పరిపాటి అని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదించడంపై విమర్శలు వచ్చాయి. జెడ్ కేటగిరి భద్రత ఉన్న లోకేష్ కు 2+2 గన్ మెన్ల భద్రత మాత్రమే కల్పించగా..చంద్రబాబు కుటుంబసభ్యులకు పూర్తిగా సెక్యూరిటీ తొలగించారు.
ఇక, వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కోటంరెడ్డికి భద్రతను 2+2 నుంచి 1+1కు కుదించింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేసినందుకే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు కూడా భద్రత తొలగించింది జగన్ సర్కార్.
దీంతో, పయ్యావుల హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడినందుకే తన భద్రత తొలగించారని పయ్యావుల ఆరోపించారు. కోటంరెడ్డి, ఆనంల భద్రత కుదించిన అంశాన్ని పయ్యావుల తన పిటిషన్ లో ప్రస్తావించారు.
1994 నుంచి తనకు 2 ప్లస్ 2 భద్రత ఉందని, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినప్పటి నుంచి భద్రత తొలగించారని అన్నారు. గత 6 నెలలుగా తాను భద్రత లేకుండానే తిరుగుతున్నానని, త్వరలో ఎన్నికలు రానున్నాయని చెప్పారు. తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ప్రచారం కోసం తిరిగేందుకు భద్రత అవసరమని పయ్యావుల కోర్టుకు విజ్ఞప్తి చేశారు.