రాజమండ్రి సెంట్రల్ జైల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని పవన్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో టిడిపితో జనసేన కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై చర్చించేందుకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయితే ఇష్టం వచ్చినట్లు చేస్తావా జగన్ అంటూ పవన్ నిప్పులు చెరిగారు. నువ్వు ఎంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్న జగన్ కు సిగ్గుందా అని ప్రశ్నించారు. తాను సంయమనం పాటిస్తున్నానని, దానిని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలు రెచ్చగొడితేనే తాను స్పందించాల్సి వస్తుందని అన్నారు.
జగన్ ను ముందు గౌరవంగానే సార్ అని పిలిచామని, అయితే ఆ విలువ నిలబెట్టుకో లేకపోవడంతోనే ఏకవచనంతో పిలవాల్సి వస్తుందని అన్నారు. జగన్ చెప్పినట్టు చేసే అధికారులు కూడా ఆలోచించాలని, వారు చేసేది సబబు కాదు, ఒకసారి చూసుకోవాలని హితవుపలికారు. ఎస్సీ, ఎస్టీ కేసులు హత్యాయత్నం కేసులు పెట్టి అమాయకులను వేధించడం సరికాదని అన్నారు. ప్రజలకు కోపం వస్తే దేశాధినేతలనే కొట్టి చంపిన దాఖలాలున్నాయని వార్నింగ్ ఇచ్చారు పవన్.
సీఎం అయిన తర్వాత ఏమైనా కొమ్ములు వస్తాయా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన ఎదుర్కోవడం అంత సామాన్యమైన విషయం కాదని, కానీ తాను అన్నిటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి భయపెట్టలేరని, ఎన్ని కేసులు పెడతారని ప్రశ్నించారు.