2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు కూడా. అయితే, ఆ తర్వాత ఈ పొత్తు వ్యవహారంపై పవన్ పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పొత్తుల గురించి ఏ పార్టీతో మాట్లాడలేదని, సీట్ల పంపకాల గురించి చర్చించలేదని పవన చేసిన కామెంట్లు కాక రేపాయి.
అదే సమయంలో జనసేనతో బీజేపీ కలిసే ఉందని, పవన్ మావాడేనంటూ బీజేపీ నేతలు స్టేట్ మెంట్లు ఇచ్చేయడంతో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు వ్యవహారం అలా సందిగ్ధంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ పలు అంశాలపై చర్చించారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలతో పాటు పొత్తులపై కూడా వారిద్దరూ తీవ్రస్థాయిలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో పవన్, చంద్రబాబులు భేటీ కావడం ఇది మూడోసారి. పవన్ ను కొద్ది నెలల క్రితం విశాఖలో పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్ హోటల్ కు వెళ్లి పవన్ ను పరామర్శించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశమయ్యారు. తాజాగా మరోసారి చంద్రబాబు నివాసంలో వారిద్దరూ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.