జైలు నుంచి విడుదలైన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా తీసిన పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, షణ్ముఖ వ్యూహంపై 2 గంటలపాటు వార చర్చించుకున్నట్లు తెలుస్తోంది. 6 అంశాలతో షణ్ముఖ వ్యూహం ప్రతిపాదనను చంద్రబాబు ముందు పవన్ ఉంచినట్లు తెలుస్తోంది.
జగన్ పై పవన్, చంద్రబాబుల షణ్ముఖ వ్యూహం ఇదే…
*అమరావతిని రాజధానిగా కొనసాగించడం, విశాఖ తిరుపతి, విజయవాడ ను క్లస్టర్లవారీగా మహానగరాలుగా అభివృద్ధి చేయడం
*సంపన్న ఏపీ పేరుతో వివిధ రంగాలకు ఆర్థిక ప్రోత్సాహం, వ్యవసాయం- బంగారు ఫల సాయం పేరుతో ఉద్యాన రైతులకు 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు, చిన్న నీటిపారుదల రంగాన్ని ప్రోత్సహించడం
* మన ఏపీ-మన ఉద్యోగాలు పేరుతో ప్రతి ఏటా పోస్టుల భర్తీ, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలకు 10 లక్షల ఆర్థిక సాయం, చిన్న తరహా పరిశ్రమలకు చేయూత, ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళిక, ఏటా లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.
* 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూత
* దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ
కాగా, హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి నుంచి శుక్రవారం నాడు చంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళవారం నాడు కంటికి సంబంధించిన శస్త్ర చికిత్స చంద్రబాబు చేయించుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.