తాజాగా నెల్లూరులో జనసేన నేత ఒకరు భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఒక బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం జరుగుతుంది అంటూ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతోపాటు చాలా రోజుల నుంచి పవనే సీఎం అభ్యర్థి అని, ఈసారి టిడిపి తగ్గాలి అని, అప్పుడే ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే, నువ్వే దిక్కు పవన్ అని పవన్ ఫొటో ముందు చంద్రబాబు చేతులు జోడించినట్లుగా ఉన్న ఒక ఎడిటెడ్ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పొత్తులపై తొలిసారిగా డైరెక్ట్ గా స్పందించిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కాదని, ముఖ్యమంత్రి పీఠాన్ని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన ప్రధాన అజెండా అని, ఆ దిశగా కలిసివచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళ్తానని పవన్ స్పష్టం చేశారు.
అయితే పొత్తులపై తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ భాగస్వామి బిజెపి కూడా అదే స్థాయిలో పొత్తుల గురించి ఆలోచించాలని పవన్ అన్నారు. ఇటీవల తాను టిడిపి నేతలతో భేటీ అవుతుంటే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని పవన్ అన్నారు. ఈసారి మీరు తగ్గడం ఏంటి, మీరు సీఎం అభ్యర్థి అని అవతలి వాళ్ళు ఒప్పుకుంటేనే పొత్తు పెట్టుకోండి అని తనకు కొందరు మిత్రులు, జనసేన నేతలు సలహాలు ఇస్తున్నారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని, అప్పుడు 30 నుంచి 40 స్థానాల్లో గెలిచి ఉంటే ఈరోజు సీఎం అభ్యర్థిగా బరిలో దిగే వీలు ఉండేదని పవన్ అభిప్రాయపడ్డారు. అలా తాము గెలిచి ఉంటే ఈరోజు జనసేన ఒంటరిగా పోటీ చేయగలదన్న నమ్మకం ఉండేదని పవన్ చెప్పుకొచ్చారు. కర్ణాటకలో కుమారస్వామి మాదిరిగా చక్రం తిప్పాలంటే కనీసం 30 నుంచి 40 స్థానాలు చేతిలో ఉండాలని పవన్ అన్నారు
తమ గౌరవానికి భంగం కలగకుండా ఉంటేనే ఇతర పార్టీలతో పొత్తులుంటాయని, కొందరిని పెద్దన్న పాత్ర వహించమని కోరానని పరోక్షంగా టిడిపిని ఉద్దేశించే పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పెద్దన్న పాత్ర అంటే బాధ్యత వహించడం అని, ఏదో ఒక కులం కోసం పనిచేయడం లేదని పవన్ అన్నారు. అన్ని కులాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే పొత్తు అనే పదాన్ని వాడానని, దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
సినిమాల్లో సూపర్ స్టార్ హోదాను తనకు తానుగా తెచ్చుకున్నానని, రాజకీయాల్లో కూడా అంతేనని పవన్ చెప్పారు. అటువంటిది తనను సీఎం అభ్యర్థిగా చేస్తామని బిజెపి, టిడిపి ఎందుకు అంటాయని పవన్ ప్రశ్నించారు. తాను టీడీపీ లేదా బీజేపీ అధ్యక్షుడి స్థానంలో ఉంటే..వేరే వ్యక్తిని సీఎం చేస్తానని ఎందుకు అంటానని పవన్ అన్నారు. రాజకీయాల్లో తనకు తానుగా కష్టపడి ఆ స్థాయికి చేరాల్సిందేనని పవన్ క్లారిటీనిచ్చారు.
ఒకవేళ పొత్తు ఏర్పడితే వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడడం అనే ఎజెండా మీద ఏర్పడుతుందని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఇక, ముందస్తు ఎన్నికల పుకార్ల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నుంచి మంగళగిరిలోనే ఎక్కువ సమయం ఉండి కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని పవన్ అన్నారు. ఏది ఏమైనా..పొత్తులపై పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.