ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ తరచుగా చెబుతున్న `వైనాట్ 175` అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తిగా స్పందించారు. 175 స్థానాలకు.. 175 స్థానాలు మీకొచ్చేస్తే.. మేం చూస్తూ.. నోట్లో వేలు పెట్టుకుని కూర్చొంటామా..? అని పవన్ కల్యాణ్ అన్నారు. 175 స్థానాలు తీసేసుకుని ఇంకొన్ని ఇళ్లు కూల్చ మని చెప్పేస్తామా..? తన అభిమానులు కూడా వైసీపీకి గత ఎన్నికల్లో ఓటేస్తే.. మీరు చేసే పని ఇదా..? అంటూ నిలదీశారు.
వైసీపీని ఇలాగే వదిలేస్తా.. వైఎస్సార్ కడప అని పేరు పెట్టినట్టు.. `వైఎస్సార్ ఇండియా` అని పెట్టేస్తారే మో..? అని పవన్ అన్నారు. ఎన్టీఆర్తో జగన్ పోల్చుకోకూడదని హితవు పలికారు. వైఎస్సార్.. గాంధీ, అంబేడ్కర్ కంటే గొప్ప వ్యక్తి కాదన్నారు. జగన్ ఉత్తముడేం కాదని.. ఆయన ఉత్తముడు, మంచోడైతే.. తాను ఇప్పటికే రాజకీయాలను వదిలేసి ఉండేవాడినని పవన్ సంచలన కామెంట్లు చేశారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను కోరారు. నన్ను చూసి ఓటేయొద్దని.. తమ విధానాలను చూసి ఓటేయాలన్నారు. ఈసారి ఆచితూచి అడుగులేస్తూ వ్యూహాలు ఉంటాయని.. మద్దతివ్వాలన్నారు. ప్రజలను బెదిరించే వారు ఎవ్వరైనా సరే ఎల్లవేళలా అధికారంలో ఉండరన్నారు. 2024 ఎన్నికలు తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్లకు సమాధానం చెబుతానన్నారు.
ఇప్పటి నుంచే వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారినెవ్వర్నీ మరిచిపోనని పవన్ కల్యాణ్ మరోసారి హెచ్చరించారు. రాజకీయాలంటే.. పదవులు అనుభవించడం.. కాదని, ప్రజలకు సేవ చేయాలనిఅన్నారు. అందుకే జనసేన వచ్చిందని చెప్పారు.
గతంలో మండలి వెంకట కృష్ణారావు వంటివారు.. ఈ నేల మీద తిరిగారా? అని ఆశ్చర్యం వేసేలా రాజకీయాలు చేశారని అన్నారు. చిరిగిపోయిన చెప్పులతోనే అసెంబ్లీకి వెళ్లిన నాయకులు ఉన్నారని.. సైకిల్ మీద పుచ్చలపల్లి సుందరయ్య వంటివారు రాజ్యసభకు వెళ్లారని.. కానీ, ఈ రోజు వైసీపీ నేతలను చూస్తుంటే.. చిరాకు పుడుతోందని పవన్ అన్నారు.