వరద బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్న ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ పవన్ కళ్యాణ్ ఉద్రేకపూరిత ప్రసంగం చేస్తూ జనసైనికుల్లో ఉత్సాహం నింపారు.
ఈరోజు తుఫాను ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా పెడన, గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు మాటలతో గాయాలు చేశారు.
పేకాట క్లబ్బులు నడిపేవాళ్లు రాజకీయం చేయొచ్చు. సిమెంటు ఫ్యాక్టరీలు నడుపుతూ రాజకీయం చేయొచ్చు కానీ సినిమాలు చేస్తూ రాజకీయం చేయకూడదా? మీరేదో నిత్యం ఖద్దరు కట్టుకుని ప్రజల సేవలో నిమగ్నమైనట్టు సుద్దులు చెబుతారా? మీరు మీ కంపెనీలు, క్లబ్బులు నడుపుకోవడానికి రాజకీయం చేస్తున్నారు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయం చేస్తున్నాను. నేను సినిమాల్లో సంపాదించిన ప్రతిరూపాయి పోగొట్టుకుంటాను. మీరు రాజకీయంలో పోగొట్టుకున్న ప్రతిరూపాయి సంపాదించుకోవడానికి పనిచేస్తారు అంటూ ఫైర్ అయ్యారు.
మీ బతుకంతా సంపాదన కోసమే. వేలకొట్లు వెనకేసుకొన్నారు. నేను ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాను. మీలాగ నాతో నల్ల డబ్బు లేదు కాబట్టి సినిమాలు చేసుకుంటున్నాను. ఆ డబ్బుతోనే పార్టీ నడుపుతాను నాకి అక్రమ సంపాదనలేవీ లేవు మీ లాగ అని వ్యాఖ్యానించారు.