రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా నాయకులకు ఉండే ఏకైక లక్షణం..ఎదుటివారికి నీతులు చెప్పడమే! తమ దాకా వస్తే.. మాత్రం ఆ నీతులు, సూక్తులకు మాత్రం తావుండదు!! ఈ విషయంలో ప్రశ్నిస్తానంటూ.. రాజకీయాల్లోకి ప్రవేశించి కొత్తగా పార్టీ పెట్టుకున్న జనసేనాని పవన్ కూడా `అంతే` అని అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారడం గమనార్హం. గతంలో వైసీపీని రెడ్ల పార్టీ అంటూ.. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇతర సామాజిక వర్గాల ఓట్లను చీల్చేందుకు ఆయన ఈ వ్యాఖ్యలను ఆయుధంగా వాడుకున్నారు.
ఇక, టీడీపీతో అనుబంధం సాగినన్నాళ్లు.. బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత చెలిమి ఛిద్రమైన నేపథ్యంలో స్వయంగా తాను అనకపోయినా..తన పార్టీ కీలక నేతలతో కామెంట్లు గుప్పించేవారు. కమ్మల పార్టీ అని.. టీడీపీపై జనసేన నాయకులు పలువురు అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఏ కీలక నాయకుడితో సమావేశమైనా.. కమ్మలు గూడు పుఠానీ చేస్తున్నారని దుయ్యబట్టేవారు. ఇలా.. అటు వైసీపీని రెడ్డిసామాజిక వర్గంతోను, ఇటు టీడీపీని కమ్మ సామాజికవర్గంతో కలిపి.. రాజకీయంగా వాడుకున్నారు. ఇది సక్సెస్ అయిందా.. లేదా.. అనే విషయాలు పక్కన పెడితే.. జనసేన వ్యవహారం, విమర్శలపై కొన్నాళ్లు చర్చ అయితే.. జరిగేది.
ఇక, తమకు ఏ కులమైతే.. లేదో.. ఏ మతమైతే లేదో.. అంటూ కామెంట్లు చేసిన జనసేనాని పవన్.. ఇప్పుడు అదే కుల రాజకీయాలకు స్కెచ్ సిద్ధం చేసుకున్నట్టు సంకేతాలు రావడంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీలు ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. తాజాగా కాపు సంఘాల నాయకులతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. కాపులకు అండగా ఉంటానని చెప్పారు. వారు అనేక కష్టాల్లో ఉన్నారని.. తాను, చేగొండి హరిరామయ్య జోగయ్య(కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ) వంటివారు ఆర్థికంగా బలంగా ఉన్నంత మాత్రాన కాపులు అందరూ.. బలంగా ఉన్నారని కాదని.. కాపుల్లో 70 శాతం మంది పేదరికంలో ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. మంచిదే.. ఎవరి సామాజిక వర్గాన్ని వారు కాపాడుకుంటే..ఎవరు మాత్రం కాదంటారు. కానీ, గతంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే.. మరి ఇప్పుడు పవన్ చేస్తోంది కూడా కుల రాజకీయమే కదా!! అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి పవన్ ఏం చెబుతారో చూడాలి.