ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన రాయి ఘటనపై రాజకీయ మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన అదినేతలు ఇద్దరూ కూడా ఈ విషయంపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా రెండు విషయాలపై ఆయన రియాక్ట్ అయ్యారు. రాయి దాడి ఘటనపై విచారణకు అధికారులను నియమించడంతోపాటు రెండులక్షల రూపాయల రివార్డును ప్రకటించడంపైనా పవన్ తనదైన శైలిలో ప్రశ్నలు గుప్పించారు. ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారని నిలదీశారు.
ఇవీ.. ప్రశ్నలు!
+ రాయిదాడి ఘటనకు భద్రతా వైఫల్యమే కారణమన్న పవన్.. భద్రతను పట్టించుకోని అధికారులకే విచారణ బాధ్యతలను ఎలా అప్పగిస్తారు?
+ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందువరకు జగన్ ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లేవారన్న పవన్.. విజయవాడలో నిర్వహించిన బస్సు యాత్ర విషయంలో ఎందుకు పరదాలు కట్టలేదని ప్రశ్నించారు.
+ రాయి దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్రపై ముందుగా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
+ గులకరాయి దాడి ఘటనకు పూర్తిగా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉందన్న పవన్.. ఎవరైతే.. ఈ కేసులో విచారణను ఎదుర్కొనాల్సి ఉందో.. వారితోనే విచారణ చేయించడం ఏంటని అన్నారు.
+ సీఎం జగన్ యాత్ర జరుగుతున్న సమయంలోనే విద్యుత్‌ను ఎందుకు నిలిపివేశారు? దీనికి బాధ్యులు ఎవరు? ఎవరు కరెంటు కోతకు ఆదేశించారు? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలపై నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు.
+ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు పోలీసులు కానీ, ఇతర భద్రతా సిబ్బంది కానీ కల్పిస్తున్న చర్యలు ఏంటి? తీసుకుంటున్న చర్యలు ఏంటి? రోప్ పార్టీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని పవన్ అనుమానాలు వ్యక్తం చేశారు.
+ రేపు ప్రధాన మంత్రి మోడీ మరోసారి ఏపీలో పర్యటనకు వస్తున్నారన్న పవన్.. ఆయనకు ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
+ ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేని డీజీపీని తక్షణమే బదిలీ చేసేందుకు ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని సూచించారు.
+ నిజాయితీపరులైన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి.. ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుందని పవన్ వ్యాఖ్యానించారు.