పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వకీల్ సాబ్ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మందికి మాత్రమే తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చిన ఈ ఈవెంట్ కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తన సినిమా ఫంక్షన్ లో పాల్గొని దాదాపు మూడేళ్లయిందని పవన్ అన్నారు. బండ్ల గణేశ్ లా తాను మాట్లాడలేనన్న పవన్…రాజకీయ సభల్లో మాట్లాడడం అలవాటైంపోయిందని అన్నారు. దిల్ రాజు వంటి మంచి నిర్మాత తనతో సినిమా తీయడం, వేణు శ్రీరామ్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తానన్నారు. అనుకోకుండా నటుడ్ని అయ్యానని, అలాగే సీఎం అవ్వాలన్న అభిమానుల కోరిక విషయంలోనూ అలాగే ఉంటానని అన్నారు.
వకీల్ నానీ పాల్కీవాలా తనకు స్ఫూర్తిదాయకం అన్న పవన్…అడ్వొకేట్ వృత్తిపై తనకు గౌరవం కలగడానికి ఆయనే కారణమన్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మానవహక్కుల కోసం బలంగా నిలబడిన వ్యక్తి పాల్కీవాలా అన్నారు. చుండూరు దళితులను ఊచకోత కేసులో బాధితుల పక్షాన పోరాడిన భువనగిరి చంద్రశేఖర్ కూడా తనకు నచ్చిన న్యాయవాది అన్నారు పవన్.
ప్రకాశ్ రాజ్ కు, తనకు మధ్య రాజకీయ విభేదాలున్నాయని, సినిమాలపరంగా తాము ఒక్కటేనని పవన్ అన్నారు. తన గురించి ప్రకాశ్ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిని తాను గౌరవిస్తానని అన్నారు. ఫ్యాన్స్ లేకుంటే తాను లేనని, వారి ఆనందం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటానని అన్నారు. తన ప్రపంచంలో తాను బతుకుతుంటానని, అది మిగతా వాళ్లకు పొగరులా ఉంటుందని వివరించారు.
తనకు సిమెంట్ వ్యాపారాలు, పేకాట దందాలు లేవని పొలిటికల్ కామెంట్లు చేసిన పవన్…తన సినిమా వల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇందులో ఎలాంటి అవినీతి ఉండదని, భగవంతుడు కరుణించినంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పవన్ కల్యాణ్…ప్రముఖ డ్రమ్మర్ శివమణితో కలిసి డ్రమ్స్ వాయించడం ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.