పవన్ తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్ నుంచి రాష్ట్రంలో బస్సుయాత్ర చేపట్టబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. త్వరలో కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నూతన లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
పవన్ అభిమానులు బస్సుయాత్రతో మా పవర్ జనానికి తెలుస్తుంది అనుకుంటూ మంచి ఉత్సాహంతో ఉన్నారు. కానీ పవన్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. పవన్ ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారో గాని బయటకు మాత్రం తాను కొన్ని కారణాలు వెల్లడించారు.
కొందరు సీనియర్లు, మేధావుల సలహా మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదటి సమీక్ష విజయవాడ వెస్ట్ నుండి ప్రారంభమవుతుందని వెల్లడించారు. కాగా ఈ నియోజకవర్గానికి పోతిన మహేష్ ఇంఛార్జిగా ఉన్నారు. బస్సుయాత్ర కు ముందు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడతామని జనసేన అధినేత తెలిపారు.
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో తాము చేసిన కొన్ని రహస్య సర్వేల ఆధారంగానే ఈ సీనియర్లు తనకు సలహా ఇచ్చారని పవన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 40 నుంచి 67 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సీనియర్లు తనతో చెప్పారని, అదే సమయంలో జనసేనకు అవకాశాలు పెరుగుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలని, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండాలని పెద్దలు, మేధావులు సూచించారు. ఈ సలహాకు తాను అంగీకరించానని, ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన అధినేత తెలిపారు.
పార్టీ స్థితి, బలాబలాలు, బలహీనతలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉందో కూడా అధ్యయనం చేసి పార్టీని బలహీనపరిచేందుకు కృషి చేస్తానన్నారు. అధికారం దక్కించుకోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పార్టీలోకి వచ్చేవారిని ప్రోత్సహిస్తామన్నారు. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో జనసేన జెండా రెపరెపలాడాలని పవన్ కల్యాణ్ అన్నారు.