జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అసలు విషయం ఇపుడు బోధ పడినట్లుంది. ఎన్నికల్లో డబ్బు లేకపోతే ఏమీ చేయలేమన్న విషయాన్ని ఇపుడు అంగీకరించారు. కొత్త తరహా రాజకీయమని, డబ్బుల ప్రస్తావన లేని రాజకీయమని ఇంతకాలం చెప్పారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి డబ్బు ప్రాధాన్యత ఏమిటో తెలిసొచ్చినట్లుంది. అందుకనే టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకున్న ఆశావహులకు డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటారని డైరెక్టుగానే అడుగుతున్నారట. ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులకు రకరకాల ఖర్చులుంటాయని అందరికీ తెలిసిందే.
ఎన్నికల్లోకి దిగిన తర్వాత అభ్యర్థులు ఖర్చులకు వెనకాడితే గెలుపు మీద ఆశలు వదులుకోవాల్సిందే. డబ్బులు ఖర్చు పెట్టకపోయినా గెలిచే అభ్యర్ధులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారికి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకుంటే తప్ప డబ్బులు తీయకపోయినా గెలుపు సాధ్యం కాదు. రాబోయే ఎన్నికల్లో సుమారు 25 నియోజకవర్గాల్లో జనసేన తరపున అభ్యర్ధులు పోటీచేయబోతున్నారు. మరి వీళ్ళల్లో ఎంతమంది డబ్బులు ఖర్చులు చేయగలిగిన వాళ్ళున్నారో చూడాలి. ఎందుకంటే ప్రత్యర్ధులు గట్టిగా డబ్బులు ఖర్చులు చేస్తున్నపుడు జనసేన అభ్యర్ధులు కూడా ఖర్చులు చేయగలిగిన వాళ్ళయివుండాల్సిందే.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఐదారు మంది అభ్యర్థులు మాత్రం ఆర్థికంగా గట్టి స్థితిలో ఉన్నారట. ప్రత్యర్ధులు చేసేంత స్ధాయిలో ఖర్చులు చేయలేకపోయినా అవసరానికి సరిపడా ఖర్చులు చేయగలిగిన వాళ్ళేనట. అయితే డబ్బులున్నాయి కాబట్టి ఖర్చులు చేస్తారని అనుకునేందుకు లేదు. డబ్బులుండటం వేరు ఖర్చులు చేయటం వేరన్న విషయం అందరికీ తెలిసిందే. భీమవరంలో పోటీ చేయబోతున్న పవన్ ఖర్చుల విషయంలో ఏమి చేస్తారో చూడాల్సిందే. అలాగే తెనాలిలో నాదెండ్ల మనోహర్ వ్యవహారం ఏమిటో అర్ధం కావటం లేదు.
ఈసారి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులకు కూడా తెలుగుదేశం నుంచి అధికారికంగా ఆర్థిక సాయం ఉండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికి పార్టీ పెట్టిన పదేళ్ళకి పార్టీ నడపాలన్నా, ఎన్నికల్లో పోటీచేయాలన్నా డబ్బు లేకపోతే ఏమీ చేయలేమన్న విషయం పవన్ కు ఇప్పటికి బోధపడటం అర్ధమవటం సంతోషమనే చెప్పాలి.
డబ్బులు పంచలేదని ఓటర్లు ధర్నాలు చేస్తున్న కాలమిది… అలాంటపుడు డబ్బులేకుండా ఎన్నికలు చేయడం ఏ పార్టీకి సాధ్యం కాదు.