సినిమాల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు కోరుకునేది ఒకటి. ఆయన చేస్తున్నది ఇంకోటి. తన ఇమేజ్‌కు తగ్గ, కొత్త కథలతో సినిమాలు చేయమని అభిమానులు కోరుకుంటుంటే.. ఆయనేమో ఎక్కువగా రీమేక్‌లతో కాలం గడిపేస్తున్నాడు.
రీఎంట్రీ తర్వాత పవన్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంగా షూటింగ్ దశలో ఉన్న హరిహర వీరమల్లు ఎప్పుడు పూర్తవుతుంది, రిలీజ్ అవుతుంది అని అభిమానులు చూస్తుంటే కొత్తగా సుజీత్‌తో సినిమా అనౌన్స్ చేయించాడు పవన్.
ఐతే ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. ఈలోపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కొత్త సినిమాకు ముహూర్తం జరగబోతున్నట్లు అప్డేట్ బయటికి వచ్చింది. ఐతే ఇదేమీ ఇంతకుముందు అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ కాదట. తమిళ హిట్ తెరికి రీమేక్ అన్నది విశ్వసనీయ సమాచారం.
ఇంతకుముందు దబంగ్‌ను గబ్బర్‌సింగ్‌గా రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు హరీష్. ఐతే దబంగ్ గురించి మన ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఆ సినిమా చూసిన వాళ్లు తక్కువ. పైగా అది విషయం ఉన్న సినిమా. కానీ తెరి ఎప్పుడో వచ్చిన బాషా సినిమా స్టయిల్లో సాగే రొటీన్ మాస్ మసాలా సినిమా. పైగా ఆ చిత్రం తెలుగులో అనువాదమై థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత పలుమార్లు టీవీలో వస్తోంది. ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం ఏంటి అంటూ.. పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు.
ఈ సినిమాకు ముహూర్త కార్యక్రమం చేయబోతున్నారని సమాచారం రావడం.. హరీష్ శంకర్ సైతం ఆ దిశగా హింట్ ఇవ్వడం, అది తెరి రీమేకే అనే సమాచారం ఉండడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం మామూలుగా లేదు. #WeDontWantTheriRemake అంటూ గురువారం మధ్యాహ్నం నుంచి హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్వీట్లు వేస్తున్నారు. పవన్, హరీష్ సహా అందరినీ ట్రోల్ చేస్తూ ఈ సినిమా పట్ల తమ వ్యతిరేకతను గట్టిగా చాటుతున్నారు. మరి ఈ నెగెటివిటీని తట్టుకుని ఎలా సినిమాను ముందుకు తీసుకెళ్తారో చూడాలి.