పెడన బహిరంగ సభలో టీడీపీ బలహీనంగా ఉందని పవన్ చేసిన వ్యాఖ్యలు కొందరు టీడీపీ నేతలకు కూడా రుచించలేదు. అనుభవమున్న టీడీపీకి జనసేన పోరాట పటిమ అవసరం అని పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇక, ఆ వ్యాఖ్యలకు పెడర్థాలు తీసిన సజ్జల…టీడీపీ పనైపోయిందని పవన్ అన్నాడంటూ మీడియా సమావేశంలో కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే కైకలూరులో జరిగిన బహిరంగ సభలో ఆ వ్యాఖ్యలపై పవన్ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. తాను అన్న మాటలను టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలని పవన్ చెప్పారు. జనసేన-టీడీపీ కలిసి పదేళ్లపాటు పనిచేయాల్సి ఉందని పవన్ అన్నారు.
2014లో శ్రీకాకుళం ప్రజలు ప్రశ్నించడంతో..మాటా మాటా పెరిగి టీడీపీతో పొత్తు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అన్నారు. 2023లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన-టీడీపీ కలిసి పోరాడుతాయని అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలని, జనసేన నేతలతో టీడీపీ నేతలు స్నేహంగా ఉండాలని, పాత గొడవలు మరచిపోవాలని అన్నారు. చంద్రబాబుతో గతంలో విభేదాలున్నా జైలులో ఆయనను కలిశానని చెప్పారు. 2014లో తన వల్లే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందని అనలేదని చెప్పారు. ఏమీ ఆశించకుండా టీడీపీకి జనసేన మద్దతునిచ్చిందని, ఆ కృతజ్ఞత టీడీపీ నేతలకు ఉండాలని తాను అన్నానని పవన్ చెప్పారు.
చంద్రబాబు జైలు నుంచి త్వరలోనే బయటకు వస్తారని పవన్ చెప్పారు. ఏపీని కాపాడాలని బిజెపిని, మోడీని అడిగానని చెప్పారు. బీజేపీ ఆశీస్సులతో సీఎం అయితే సంతోషమని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని అన్నారు. సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని లేకుంటే బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు.