కైకలూరులోని ముదినేపల్లిలో జరిగిన వారాహి బహిరంగ సభలో ఎన్డీఏ-జనసేన పొత్తు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి జనసేన తప్పుకుందని సజ్జల చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. జనసేన ఎన్డీఏలో ఉన్నా లేకున్నా వైసీపీకి వచ్చిన నష్టమేంటి అని పవన్ ప్రశ్నించారు. 151 సీట్లున్న వైసీపీ జనసేనను చూసి భయపడుతోందని విమర్శించారు. తన పార్టీకి 151 సీట్లుంటే ప్రతిపక్షాలను పట్టించుకునేవాడిని కాదని అన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే తానే ఆ విషయం వెల్లడిస్తానని అన్నారు. ఎన్డీఏ నుంచి జనసేన బయటకు వచ్చిందని వైసీపీ చెబితే ఎలా అని నిలదీశారు. ఎన్డీఏతో జనసేన కలిసే ఉందని పవన్ క్లారిటీనిచ్చారు.
ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలంటే తనకు అమిత గౌరవం అని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు పోతాయని తాను భావిస్తున్నానని పవన్ అన్నారు. నీ అంతు చూస్తాం అని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, 2009లో వైసీపీకే భయపడని తాను జగన్ కు భయపడతానా అని ప్రశ్నించారు. 2014లో వైసీపీ ఓటమి తర్వాత జనసేన ఆఫీసు దగ్గరకు వైసీపీ రౌడీలు వచ్చారని, 2014లో టీడీపీ ఓడిపోయుంటే తన పరిస్థితి ఏంటని అన్నారు. 2024 ఎన్నికలలో టీడీపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.