మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు నిందితుల్లో ఒకరైన డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడికావడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టింది జగన్ సన్నిహితులేనని పట్టాభి షాకింగ్ కామెంట్లు చేశారు. వివేకా మర్డర్ వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి డి.శంకర్‌రెడ్డి అని అన్నారు. హత్య తర్వాత దస్తగిరి.. రాజారెడ్డి ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడని పట్టాభి ప్రశ్నించారు. నిందితులను ముందుండి నడిపించింది శంకర్ రెడ్డేనని ఆరపించారు. హత్య అయిన తర్వాత వివేకా ఇంటికి మొదటగా చేరుకుంది.. శంకర్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డిలేనని ఆరోపించారు.వైఎస్ కుటుంబానికి అవినాష్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని అన్నారు.
తనకు ప్రాణహాని ఉందని వివేకా కూతురు వైఎస్ సునీతా రెడ్డి చాలాసార్లు ఆరోపించారని గుర్తు చేశారు. సునీతకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. అవినాష్ రెడ్డికి శంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని పట్టాభి ఆరోపించారు. అంతేకాదు, వైఎస్ సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కూడా శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిల ప్రస్తావన ఉందని గుర్తు చేశారు.
వివేకా హత్య రోజు ఘటనా స్థలానికి ముందుగా చేరుకున్న అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు… సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ కేసులో సిట్‌ను రెండుసార్లు మార్చి కేసును జగన్ నీరుగార్చే ప్రయత్నం చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈ కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో పాటు జగన్ ను కూడా సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.