టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి, టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటన పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మరోవైపు, బెయిల్ పై విడుదలైన తర్వాత పట్టాభి తన కుటుంబంతో కలిసి మాల్దీవులు వెళ్లారు. అయితే, పట్టాభి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారని కొందరు…వైసీపీ నేతలకు భయపడి పారిపోయారని మరికొందరు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పట్టాభి తాను విదేశాలకు వెళ్లడానికి గల కారణాలను వివరిస్తూ సంచలన వీడియో విడుదల చేశారు. తన ఇంటిపై దాడి జరిగిన సమయంలో తన కుమార్తె అక్కడే ఉందని, ఆ దాడి ఘటనతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని పట్టాభి వెల్లడించారు. ఆ దాడి తాలూకు భయం నుంచి తన కూతురు బయటపడేందుకు తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చానని పట్టాభి వివరించారు. దానికి కూడా కొందరు పెడర్థాలు తీస్తూ దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
తనపై నమోదైన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని పట్టాభి అన్నారు. తన వ్యాఖ్యలకు లేనిపోని అర్థాలను తీశారని అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తనపై, తన ఇంటిపై దాడులకు దిగారని ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేయడం మూడోసారని అన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే వేరే చోటికి వచ్చానని వివరించారు. బాధ్యత గల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా త్వరలోనే మళ్లీ ఏపీకి వచ్చి పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తానని అన్నారు.
డ్రగ్స్ మాఫియాపై టీడీపీ పోరాటం కొనసాగుతుందని, అందులో తన వంతు పాత్ర పోషిస్తానని వెల్లడించారు. రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు, లోకేష్ డ్రగ్స్‌పై చేస్తున్న ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటానని అన్నారు.