పల్నాడు లో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాద వేళ.. అక్కడి ప్రజలు వందలాదిగా బకెట్లను.. పెద్ద పెద్ద స్టీల్ పాత్రల్ని పట్టుకొని రోడ్ల మీద పరుగులు తీసేలా చేసింది. దీనికి కారణం.. రోడ్డు ప్రమాదంలో భాగంగా బోల్తా పడిన భారీ లారీ పామాయిల్ ట్యాంకర్ కావటమే. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో అక్కడి ప్రజలు వందలాదిగా రోడ్ల మీద పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్ జాం అయిన పరిస్థితి.
అద్దంకి – నార్కెట్ పల్లి హైవే మీద వెళుతున్న భారీ పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. బోల్తా పడిన ట్యాంకర్ నుంచి పామాయిల్ కిందకు రావటంతో.. అది చూసిన జనం తమ ఇంట్లోని బిందెలు.. బకెట్లు.. స్టీల్ పాత్రల్ని పట్టుకొని రోడ్ల మీదకు వచ్చారు. దీంతో.. అక్కడి వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చేసరికే.. వందలాదిగా గుమిగూడిన జనం ఎవరికి వారు తమకు దొరికినంత పామాయిల్ ను సొంతం చేసుకున్నారు. దీంతో.. వారిని చెదరగొట్టిన పోలీసులు.. క్రేన్ సాయంతో ట్యాంకర్ ను పక్కకు తొలగించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంతో పాటు.. రోడ్డు మీద పామాయిల్ తో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.