ఒకప్పుడు పిల్లల్ని కంటుంటే.. వద్దంటే వద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఒక నినాదం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేమంటే.. ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అంటూ ప్రచారం చేసి కుటుంబ నియంత్రణకు నడుం బిగించాలని కోరటం తెలిసిందే. దీనికి తగ్గట్లే దేశ ప్రజల్లో మార్పు రావటం తెలిసిందే. ఇటీవల కాలంలో పిల్లల్ని పెద్ద ఎత్తున కనాలన్న ప్రకటనలు ఎక్కువ అవుతున్నాయి.
దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును కూడా చెప్పొచ్చు. గతంలో తాను పిల్లల్ని వద్దని చెప్పేవాడినని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని పెద్ద ఎత్తున కనాలంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండోర్ లో ఒక పెద్ద మనిషి సంచలన ప్రకటన చేశారు. సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతుందని.. భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని ప్రతి బ్రాహ్మణ జంట నలుగురిని కనాలని.. అలా కన్న వారికి తాను రూ.లక్ష చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు మధ్యప్రదేశ్ పరశురామ్ కళ్యాణ్ బోర్డు చీఫ్ పండిత్ విష్ణు రాజోరియా. ఆదివారం ఇండోర్ లో జరిగిన సనాధ్య బ్రాహ్మణ వర్గాల్లో పెళ్లీడు యువతీయువకుల పరిచయ సమ్మేళనం.. వివాహ కార్యక్రమాల్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బ్రాహ్మణ యువ జంటలు చక్కటి సంపాదన.. ఉద్యోగం ఉండి కూడా కేవలం ఒక సంతానంతో సరిపెట్టుకుంటున్నారని.. ఈ పద్దతి మంచిది కాదన్నారు. సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గుతోందని.. స్వాంత్యత్రం వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు సగానికి సగం జనాభా తగ్గిందని.. హిందూయేరత జనాభా అమాంతం పెరుగుతుంటే.. మన వర్గీయుల జనాభా వ్యవహారాల మీద ఫోకస్ పెట్టటం మానేశారన్నారు. అందుకే ప్రతి బ్రాహ్మణ జంట కనీసం నలుగురిని కనాలన్న ఆయన.. అలా చేసిన వారికి రూ.లక్ష చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.