కొంతకాలంగా ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ అంటూ జగన్ సర్కార్ కొత్త కలెక్షన్ కు తెరతీసిన సంగతి తెలిసిందే. 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పట్టించుకోని విషయాన్ని బయటకు వెలికి తీసి ‘బకాయిల’ వసూలు ప్రారంభించింది. ఇక, ఈ బాదుకుడు ముద్దుగా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం అని పేరు పెట్టి మరీ వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద వసూళ్లు చేపడుతోంది. గ్రామాలు మొదలు కార్పొరేషన్ల వరకు రూ.10 వేల నుంచి 15 వేల వరకూ చెల్లించాలని ఓ లిస్ట్ తయారు చేసింది.
అయితే, ఆల్రెడీ తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలున్నాయని, మరోసారి రిజిస్ట్రేషన్ దేనికని కొందరు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పెద్దాయన…జగన్ సర్కార్ తీరుపై వేసిన సెటైర్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఇంటికి పట్టా ఉందని, మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘నా పెళ్లాన్ని మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేస్తామన్నట్టు’ ప్రభుత్వ తీరు ఉందని సెటైర్ వేశారు. దీంతో, ఈ వీడియో వైరల్ అయింది. దాదాపుగా ఆ లిస్ట్ లో ఉన్నవారిలో చాలామంది ఆవేదన కూడా ఇదేనని నెటిజన్లు అంటున్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. 1983-2011 మధ్యలో ఏపీ ప్రభుత్వ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్లు నిర్మించుకొని బకాయి ఉన్నవారిని జగన్ సర్కార్ గుర్తించింది. ఆయా ప్రాంతాలను బట్టి రూ.10 వేలు-20వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, రిజిస్ట్రేషన్ పేపర్లు లేని కొందరికి ఈ పథకం వల్ల కొంత ఉపయోగం ఉన్నా…తాజాగా విడుదలైన జాబితాలో మెజారిటీ వారికి ఈ పథకం వల్ల ఉపయోగం లేదు. దీంతో, వారంతా మండిపడుతున్నారు.
అయితే, ఓటీఎస్ డబ్బులు చెల్లించకుంటే పెన్షన్‌కు కోతపెడతామని కొన్ని చోట్లుహెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేస్తున్న ఒత్తిడితో కొందరు పేదలు నానా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు, కొత్తగా ఒక్క ఇల్లూ కట్టని జగన్…చంద్రబాబు హయాంలో కట్టి నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ‘టిడ్కో’ ఇళ్లనూ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. కానీ, గతంలో లోన్ తీసుకున్నవారిపై మాత్రం ఉక్కుపాదం మోపడంపై విమర్శలు వస్తున్నాయి.