దీపావళి పండుగ వస్తుందంటే చాలు…సోషల్ మీడియాలో, మీడియాలో టపాసులు కాల్చడంపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలవుతుంది. పర్యావరణహిత క్రాకర్లు మాత్రమే కాల్చాలని, నిర్ణీత సమయంలో మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీం కోర్టు చెప్పిందని కొందరు వాదిస్తుంటారు. ఇక, 3 రోజుల పాటు టపాసులు కాల్చడంతోనే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోతుందా, కేవలం హిందూ పండుగలప్పుడు మాత్రమే ఈ నియమనిబంధనలు ఎందుకు అని మరి కొందరు వాదిస్తుంటారు.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఇదే చర్చ దీపావళి సందర్భంగా ఆల్రెడీ ఈ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన మార్క్ కామెంట్లతో స్పందించింది. దీపావళినాడు బాణసంచా కాల్చవద్దని చెప్పేవాళ్లపై కంగన ఫైర్ అయింది. అలా చెప్తున్నవారంతా పర్యావరణ పరిరక్షణ కోసం 3 రోజుల పాటు కార్లలో ప్రయాణించడం మానేసి నడిచి వెళ్లాలని సలహా ఇచ్చింది. ఆ రకంగా కాలుష్యం తగ్గుతుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
దీంతోపాటు, సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించిన వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళికి చాలా రోజుల ముందు నుంచే టపాసులు కాల్చేందుకు ఎదురు చూసేవాడినని, దీపావళి వెళ్లిన తర్వాత కాల్చడానికి కొన్ని టపాసులు దాచుకునేవాడినని సద్గురు ఆ వీడియోలో చెప్పారు. లక్షలాది చెట్లను నాటించి ప్రపంచ రికార్డు సృష్టించిన సద్గురు చెప్పిన మాటలివని అన్నారు.
కాగా, ఇటీవల సియట్ కంపెనీ టైర్ల యాడ్ లో నటించిన మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్… దీపావళి పండుగ సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చవద్దని సందేశమివ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే మండిపడ్డారు. సియట్ కంపెనీ హిందువుల సెంటిమెంటును గౌరవిస్తుందని ఆశిస్తున్నానని సియట్ ఎండీ, సీఈవో వర్ధన్ గోయెంకాకు అనంతకుమార్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలు…అమీర్ ను టార్గెట్ చేసేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.