2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ జాతీయాధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తూ ప్రచారాన్ని మొదలుబెట్టారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన నేపథ్యంలో మసకబారిని ఆప్ ప్రతిష్టను, తన పరువును నిలబెట్టి ప్రజల మన్ననలు పొందేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.
ఢిల్లీ శాసన సభ ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతామని కేజ్రీవాల్ వెల్లడించారు. ఆల్రెడీ అంతర్గత కుమ్ములాటలతో బలహీనంగా ఉంది అని విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియా కూటమికి కేజ్రీవాల్ ప్రకటన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ మాదిరి అయింది.
పొత్తులు లేవని, ఒంటరి పోరుకు రెడీ అని కేజ్రీవల్ ఇప్పుడు ప్రకటించగా…పొత్తు లేకుండా పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది. అయితే, ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఫలితాలు ఆశాజనకంగా ఏమీ లేవు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మూకుమ్మడిగా బరిలోకి దిగినా ఒక్క సీటు గెలవలేదు. అన్ని లోక్ సభ స్థానాలను బీజేపీ ఎగరేసుకుపోయింది.
పంజాబ్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. దీంతో, విడిగా పోటీ చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే, ఎన్డీఏ కాస్త బలహీనంగా ఉన్న ఈ తరుణంలో ఇండియా కూటమిలోని పార్టీలు బలపడాల్సింది పోయి ఇలా బలహీనపడడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉంటే మరోసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.