నేడు కేంద్ర బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి బడ్జెట్ లో కూడా ఏపీకి కేంద్రం మొండి చేయి చూపిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఇక, ఏపీకి కీలకమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల ఊసే లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కేంద్రానికి దాసోహం అనడం వల్లే ఏపీకి బడ్జెట్ లో అసలు ప్రాధాన్యతనివ్వలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పేదలు, రైతుల కోసం ఏంచేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని, బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని చంద్రబాబు మండిపడ్డారు.
అయితే, తాను చాలాకాలంగా చెబుతున్న నదుల అనుసంధానం అంశంపై బడ్జెట్ లో కేంద్ర ప్రణాళికలు బాగున్నాయని ప్రశంసించారు. డిజిటల్, సోలార్, విద్యుత్ ఆధారిత వాహనాల రంగంలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైసీపీ మరోసారి విఫలమైందని చంద్రబాబు దుయ్యబట్టారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఇక, ఈ బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. ఇది ఒక పనికిమాలిన, పసలేని బడ్జెట్ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, రైతులకు, పేదలకు, సామాన్యులకు, కుల వృత్తుల వారికి, ఉద్యోగులకు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ మిగిల్చిందని మండిపడ్డారు.
ఎలాంటి దిశానిర్దేశం లేకుండా బడ్జెట్ తయారు చేశారని, కానీ, బడ్జెట్ గొప్పగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటోందని ఎద్దేవా చేశారు. మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇదని సెటైర్లు వేశారు. పన్ను చెల్లింపుల విషయంలో స్లాబులను మార్చకుండా ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని దుయ్యబట్టారు. ఇక, ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యతను ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగాన్ని ప్రపంచమంతా అభివృద్ధి పరుస్తుంటే… కేంద్రానికి ఆ సోయి లేదని, దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టడం లేదని కేసీఆర్ విమర్శించారు. కాగా, ఈ బడ్జెట్ లో నదుల అనుసంధానానికి పెద్దపీట వేయడంతో చంద్రబాబు కలను నిర్మలమ్మ నెరవేర్చారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.