గడిచిన కొన్ని నెలలుగా ఏపీలో ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య నెలకొన్న పంచాయితీలు ఎంత తీవ్రరూపం దాల్చాయో తెలిసిందే. రాజ్యాంగబద్ధమైన సంస్థకు అధికారిగా నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాల అమలు విషయంలో ఆయన ఎన్నో ప్రతికూలతల్ని ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే.. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పేయటంతో సీన్ మొత్తం మారిపోయింది.
నిమ్మగడ్డ తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎదురుదెబ్బ తగటం.. భారీగా కౌంటర్ పడటం అలవాటైంది. దీంతో.. ఎన్నికల ప్రకియకు సంబంధించిన పనులు ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కు పడే పరిస్థితి. ఎప్పుడైతే.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయో.. అప్పటి నుంచి పరిణామాల్లో వేగం పుంజుకుంది. నిమ్మగడ్డ కోరుకున్న రీతిలో పనులు సాగుతున్నాయి.
గతంలో నిమ్మగడ్డ రమేశ్ కొందరు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల్ని పక్కకు తప్పుకోవాలని.. ఎన్నికల సమయంలో వారు కీలక స్థానాల్లో ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. అవి ఇప్పటివరకు అమలుకాలేదు. ఎప్పుడైతే సుప్రీం నిర్ణయం వెలువడిందో.. అప్పటి నుంచి అంతకు ముందు తగిలిన ఎదురుదెబ్బల స్థానే.. తానేం చెబితే ఆ పని వెంట వెంటనే జరిగిపోతోంది.
తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా.. తన బాద్యతల నుంచి తప్పుకున్నారు.అంతేకాదు.. పంచాయితీ ఎన్నికలు ముగిసే వరకు ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులకు బాధ్యతలు అప్పజెప్పారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కు బదిలీ అయ్యింది. ఇంచార్జి కలెక్టరుగా జేసీ.. దినేశ్ కుమార్ లు బాద్యతల్ని అప్పజెప్పారు. రేపటి నుంచి ఆయన కలెక్టర్ గా జిల్లా బాధ్యతల్ని చేపట్టనున్నారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డిని జేఏడీకి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కు బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో తొమ్మిది మంది అధికారులు అలసత్వం వహించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
అప్పట్లో ఆయన ఆదేశాలు అమలు కాలేదు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవటంపై తీవ్రంగా పరిగణించారు. తాజాగా మారిన పరిస్థితులకు అనుగుణంగా నిమ్మగడ్డ కోరినట్లుగా అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో.. నిమ్మగడ్డ కోరుకున్నంతా ఆయన కళ్ల ముందు చకచకా జరిగిపోవటం గమనార్హం.