ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగుతోన్న వైనంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసు పంపింది. అయితే, తన వ్యాఖ్యలను నాని ఉపసంహరించుకోలేదు.
ఎన్నికల సంఘం అంటే తనకు గౌరవమని, తాను ప్రతిపక్షాలను మాత్రమే విమర్శించానని తన లాయర్ ద్వారా నాని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో, కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు.
అంతకుముందు, ఎస్ఈసీ షోకాజ్ నోటీస్కు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే తాను మాట్లాడానని చెప్పారు. ప్రతిపక్షాల వేధింపులను మాత్రమే ప్రస్తావించానని, ఎస్ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందని చెప్పారు. తన లాయర్ ద్వారా పంపిన వివరణ పరిశీలించి షోకాజ్ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు. అయితే, తన వ్యాఖ్యలను నాని ఉపసంహరించుకోలేదు. దీంతో, నాని వివరణపై సంతృప్తి చెందని ఎస్ఈసీ….నానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై, పోలీసులు, ప్రభుత్వం, నాని ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.