ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూల్ బుక్ కు సంబంధించి చిన్న తేడా వచ్చినా సహించేది లేదని.. అలా చేసినోళ్లు ఎవరైనా సరే.. వారిపై చర్యల వేటు పడుతుందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీరుతో ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. తమను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న వాదనను వినిపిస్తున్నారు. నిమ్మగడ్డ సామాజిక వర్గాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించినోళ్లు లేకపోలేదు. అలాంటి నిమ్మగడ్డ.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో తనకు అందరూ సమానమే అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఆయనకు అత్యంత సన్నిహితుడి చెప్పే ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు చెందిన టీడీపీకి నోటీసులు ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. ఆయనపై విమర్శనాస్త్రాల్ని సంధించే వారికి చెక్ చెప్పినట్లైంది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయితీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయటాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ఈ వ్యవహారం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. దీంతో.. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషనర్ తాజాగా టీడీపీకి నోటీసులు జారీ చేశారు. తమకు వచ్చిన కంప్లైంట్ కు తగిన వివరణ ఇవ్వాలని.. లేకుంటే తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రకటించారు. ఓవైపు టీడీపీపై చర్యలకు నోటీసులు జారీ చేసిన నిమ్మగడ్డ.. శనివారం కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు స్ఫూర్తి అని.. రాజ్యాంగానికి వైఎస్సార్ ఎంతో గౌరవం ఇచ్చేవారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే దైర్యం తనకు ఆయన ఇచ్చిందేనని చెప్పిన నిమ్మగడ్డ.. తన గుండెలో వైఎస్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నా తాను ఎప్పుడూ ఇబ్బందులకు గురి కాలేదని.. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టును.. రాజ్యాంగాన్ని గౌరవించాలన్న ఆయన.. పంచాయితీ ఎన్నికల్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. అసాధారణ ఏకగ్రీవాలు మంచివి కావని.. వాటిపై షాడో టీంలు కచ్ఛితంగా దృష్టి పెడతాయని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలు తప్పుకాదని..కానీ అసాధారణ ఏకగ్రీవాలు జరిగితే మాత్రం తాము పరిశీలిస్తామన్నారు. పని చేసే వారిపై విమర్శలు తప్పవని.. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అందరూ కృషి చేయాలని కోరారు. ఇప్పటివరకు తనలోని ఒక కోణాన్ని చూపించిన నిమ్మగడ్డ.. తాజా కడప జిల్లా పర్యటనలో తనలోని మరో కోణాన్ని చూపించారన్న మాట వినిపిస్తోంది.