దేశంలో జరిగే చాలా దారుణాల వెనుక ‘డి’ గ్యాంగ్ హస్తం ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ ను ఒంటి కన్నుతో శాసించటమే కాద.. ఆయుధాల స్మగ్లింగ్.. డ్రగ్స్ విక్రయం.. నకిలీ కరెన్సీ నోట్ల చలామణి.. ఇలా దరిద్రపుగొట్టు పనులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక ప్రకటనను జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నిజానికి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన వెంటనే దావూద్ సంగతి తేలుస్తారన్న ప్రచారం జరిగినా.. గడిచిన ఎనిమిదేళ్లుగా అలాంటివేమీ చోటు చేసుకోలేదు.
ఇలాంటివేళ.. అనూహ్యంగా దావూద్ ప్రస్తావనను తెర మీదకు తీసుకురావటం సంచలనంగా మారింది. తాజాగా దావూద్ ఇబ్రహీంతో పాటు.. అతడి ప్రధాన అనుచరుల తలకు భారీ ఆఫర్ ను ప్రకటించారు. దేశంలో చోటు చేసుకునే అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలతో పాటు.. లష్కరే తోయిబా.. జైషే మహ్మద్.. అల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నట్లుగా ఇటీవల వెల్లడైంది.
ఇలాంటివేళ.. భారత్ కు పెను ముప్పుగా మారిన దావూద్ విషయంలో లెక్క తేల్చేందుకు కేంద్రం సంకల్పించిందా? అలా అయితే.. ఆ విషయాన్ని గుట్టుగా ఉంచకుండా ఎందుకు బయటపెట్టినట్లు? అన్నది ప్రశ్న. తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూస్తే.. దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెప్పిన వారికి రూ.25 లక్షల నజరానా ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన ప్రకటన చేసింది.
అంతేకాదు.. దావూద్ కు అత్యంత సన్నిహిత అనుచరుడైన ఛోటా షకీల్ తల మీద రూ.20 లక్షల రివార్డు.. అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం మీద రూ.15 లక్షల రివార్డును ప్రకటించారు. దావూద్ అనుచరులైన జావేద్ పటేల్.. జావేద్ చిక్నా.. ఇబ్రహీం ముస్తాఖ్.. అబ్దుల్ రజాఖ్ మెమోన్ ల ఆచూకీ తెలిపిన వారికి సైతం రివార్డులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. మరి.. తాజా రివార్డు అంశం దావూద్ అండ్ కోను పట్టుకునేందుకు సాయంగా మారుతుందా? అన్నది చూడాలి.
Comments 1