24 గంటలకు పూర్వం.. కోటీశ్వరులైన రెడ్లు.. తనను తిట్టి పోస్తున్నారని.. ఎస్సీ కులపోడిని కాపోబట్టే కదా.. ఇన్ని అవమానాలు భరిస్తున్నానని.. చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కిళత్తూరు నారాయణస్వామి.. ఇప్పుడు అదే రెడ్లకాళ్లు మొక్కడం సంచలనంగా మారింది. దీంతో నారాయణ స్వామి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థకాదని ఆయన వర్గమే వ్యాఖ్యానిస్తోంది.
తన నియోజకవర్గం.. తన జిల్లా(చిత్తూరు)లో రెడ్డి వర్గం తనను దూషిస్తోందని.. కొన్నాళ్లుగా నారాయణ స్వామి కన్నీరు ఒక్కటే తక్కువ అన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కి మరీ నమస్కారం చేశారు. ఈ హఠాత్పరిణామంతో అందరూ ఆశ్చర్యాని కి లోనయ్యారు. అంతేకాదు.. నిన్న ఏమన్నారు.. ఇప్పుడు ఏం చేశారు? అని కూడా చర్చించుకున్నారు.
నారాయణ స్వామి తన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు పరిధిలోని పెనుమూరు మండలంలో నిర్మించుకున్న టీటీడీ కళ్యాణమండపం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారాయణ స్వామి ఏవేవో మాట్లాడడంతోపాటు వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కారం చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. .మాజీ సీఎం చంద్రబాబు పేరు ఎత్తకుండా ఉండలేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్లకు తన చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టిస్తానని చెప్పకపోతే పొద్దుపోదు. అని ఆయన అనుచరులే చెబుతున్నారు. మొత్తానికి ఏమి స్వామీ ఏమి కత!! అని అందరూ చర్చించుకుంటున్నారు.