హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న రాడిసన్ హోటల్ లోని పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ పబ్ లో డ్రగ్స్ పట్టుబడడం, పలువురు సినీ ప్రముఖులు, బడా బాబుల పిల్లలలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. ఆ పబ్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల, నటి హేమ కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారికి పోలీసులు నోటీసులిచ్చి వదిలేశారని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై నాగబాబు స్పందించారు. పబ్ లో నిహారిక ఉండడం వల్లే తాను మాట్లాడాల్సి వస్తోందని, నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు. తన కుమార్తె నిహారిక విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, అంతా క్లియర్ అని నాగబాబు స్పష్టం చేశారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, కాబట్టి ఈ విషయంలో ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు నాగబాబు. సోషల్ మీడియా, మీడియాలో ఊహాగానాలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.
ఇక, ఆ పబ్ లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో, ఆ పబ్ లో దొరికినవారిలో తమ కుటుంబసభ్యులు ఎవరూ లేరంటూ గల్లా కుటుంబం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మరోవైపు, తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన కుమారుడు అరవింద్ ను ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమారుడు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు ఆ హోటల్ కు వెళ్లాడని, బర్త్ డే పార్టీకి వెళితే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో పబ్బులు ఉంటున్నాయని, బర్త్ డే వేడుకలకు ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళితే, పబ్బులపై దాడుల సందర్భంగా బర్త్ డే వేడుకలకు వెళ్లిన వాళ్లను కూడా తీసుకెళుతున్నారని అన్నారు. హైదరాబాదు నగరంలో ఉన్న పబ్ లను మూసివేయాలని, లిక్కర్ నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పబ్ వ్యవహారంలో వాస్తవాలు తేల్చాలని కోరారు.
ఇక, పబ్ పై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏసీపీ, సర్కిల్ ఇన్ స్పెక్టర్ లపై చర్యలకు పూనుకున్నారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు.. బంజారాహిల్స్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివచంద్రను సస్పెండ్ చేశారు. అయితే, ఈ కేసులో ఓ మాజీ డీజీపీ కూతురితోపాటు పలువురు బడా పొలిటిషియన్లు, వ్యాపారవేత్తల పిల్లలు ఉండడంతోనే ఇలా చర్యలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.